పెట్టుబడులపై కిరికిరి వద్దు: రేవంత్ రెడ్డి
పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
By: Garuda Media | 16 July 2026 4:00 AM ISTపెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ కంపెనీలు నిర్భయంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టవచ్చని తెలిపారు. 2047 నాటికి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఆదిశగానే అభివృద్ధి చేస్తోందని తెలిపారు. దీనర్థం.. 2047 వరకు తామే అధికారంలో ఉంటామని ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా ఫ్యూచర్ సిటీలో అమేజాన్ కంపెనీ డేటా కేంద్రానికి సీఎం శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తాము వచ్చిన తర్వాత పెట్టుబడి దారులకు భరోసా కలిగిందన్నారు. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. సింగిల్ విండో ద్వారా అనుమ తులు ఇవ్వడంతో పాటు.. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు చెప్పారు. అమెజాన్ కొత్త డేటా కేంద్రం ఏర్పాటుతో వేల మందికి ఉపాధి, ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. స్థానికంగా అనేక వ్యాపారాలు కూడా అనుబంధంగా రానున్నాయన్నారు.
ఫ్యూచర్ సిటీ..
దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిని తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయంతో పాటు.. వృద్ధిని కూడా సాధించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించినట్టు పేర్కొన్నారు. ''దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది మా లక్ష్యం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని చేరుకుంటాం.'' అని రేవంత్ చెప్పారు. పెట్టుబడిదారులు నిర్భయంగా పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
పక్కనే విమానాశ్రయం..
రాష్ట్రంలో రహదారి, వాయు రవాణా విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్‌ఆర్, విమానాశ్రయం పక్క పక్కనే ఉన్నాయన్నారు. అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ చేపట్టామన్నారు. ట్రాఫిక్ సమస్యను కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
