Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మైదానంలో సూపర్ షో.. 4 గోల్స్‌తో అదరగొట్టిన సీఎం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి క్రీడామైదానంలో తన సత్తాను చాటుతూ అందరినీ ఆకట్టుకున్నారు.

By:  A.N.Kumar   |   28 March 2026 11:49 PM IST
సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మైదానంలో సూపర్ షో.. 4 గోల్స్‌తో అదరగొట్టిన సీఎం
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి క్రీడామైదానంలో తన సత్తాను చాటుతూ అందరినీ ఆకట్టుకున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య క్రీడా స్పూర్తిని పెంపొందించేందుకు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని తన జట్టు తరఫున అద్భుత ప్రదర్శన చేశారు.

మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్సాహంగా ఆడిన సీఎం, తన చురుకుదనం, క్రీడా నైపుణ్యంతో ప్రేక్షకులను మెప్పించారు. ప్రత్యర్థి జట్టుపై దూకుడుగా దాడులు కొనసాగిస్తూ మొత్తం నాలుగు గోల్స్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఇంత చురుకుగా మైదానంలో ఆడటం చూసి ప్రేక్షకులు, ప్రజాప్రతినిధులు ఆయనకు హర్షధ్వానాలు చేశారు. సీఎం ప్రదర్శనతో ఆయన జట్టు విజయం సాధించింది.

మ్యాచ్ ముగిసిన తర్వాత సహచర క్రీడాకారులు ఆనందంతో సీఎం రేవంత్ రెడ్డిని భుజాలపై ఎత్తుకుని అభినందించారు. ఈ దృశ్యం స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉండే సీఎం ఇలా క్రీడల్లో పాల్గొనడం యువతకు మంచి సందేశమని పలువురు అభిప్రాయపడ్డారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని.. క్రీడలు మన జీవితంలో భాగం కావాలని సీఎం చర్యలు సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఇక గతంలో హైదరాబాద్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనాల్ మెస్సీ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ ఆడిన విషయం కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ సంఘటన తర్వాత సీఎం క్రీడలపై ఉన్న ఆసక్తి మరింత స్పష్టమైంది.

ప్రజాప్రతినిధుల మధ్య ఐక్యత, ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందించేందుకు ఈ స్పోర్ట్స్ మీట్‌ను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ వంటి పలు క్రీడా పోటీలు కూడా జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి క్రీడామైదానంలో చూపిన ఈ ఉత్సాహం, ప్రతిభ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులు కూడా క్రీడల్లో పాల్గొని ప్రజలకు ప్రేరణ ఇవ్వగలరని ఈ సంఘటన మరోసారి నిరూపించింది.