Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డిని వదలని సీఎం రేవంత్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు.

By:  Garuda Media   |   9 Jun 2026 9:51 AM IST
కిషన్ రెడ్డిని వదలని సీఎం రేవంత్
X

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత వారాంతంలో కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి.. సోమవారం తన విమర్శల పరంపరను కొనసాగించారు. ఈసారి మరింత ఘాటుగా స్పందించటమే కాదు..కిషన్ రెడ్డికి సరికొత్త పేరు పెట్టటం గమనార్హం. తనపై విమర్శలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. తెలంగాణలో తనను ఢీ కొనే మొనగాడు లేడన్నట్లుగా వ్యాఖ్యానించటం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. తాజాగా మియాపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ కీలక అంశాల్ని ప్రస్తావించారు. తాను ప్రధానమంత్రి మోడీని.. కేంద్రమంత్రుల్ని కలిసి వచ్చిన మూడు రోజులకే కిషన్ రెడ్డి వెళ్లి.. వారిని ఏ పని చేయొద్దని చెబుతున్నట్లుగా ఆరోపించారు. ‘తెలంగాణ ప్రగతికి అడ్డుపడినోడికి పుట్టగతులుండవు. కిషన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రావులకు ఒక్కటే విజ్ఞప్తి. చేతనైతే సహకరించండి. మీ అనుభవంతో సూచన చేయండి. మీ అహకారంతో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోకండి. మీ చీకటి ఒప్పందాలు.. మీ గూడుపుఠాణిని తెలంగాణ యువత గమనిస్తున్నారు. నేను ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసినా, వేరే ఏ మంత్రిని కలిసినా మూడు రోజుల తేడాతో కిషన్‌రెడ్డి కలుస్తారు’’ అని పేర్కొన్నారు.

తనతో కలిసి రమ్మంటే మాత్రం కిషన్ రెడ్డి రాడన్న ముఖ్యమంత్రి రేవంత్.. తాను మంత్రులతో కూర్చొని ఒప్పించి.. మెప్పించి ఒక దారిలోకి పట్టకొస్తే.. కాచిన పాలల్లో ఉప్పు వేసినట్లుగా పొయి చెబుతాడన్నారు. ‘‘నువ్వు ఇచ్చినావంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి పేర్కొస్తది. మళ్లీ వాళ్ల ప్రభుత్వమే వస్తది. నువ్వు చేయకు అని కిషన్ రెడ్డి కాళ్లలో కట్టె పెడుతున్నడు. ఇట్లాంటి బుద్ధులు మానుకొండి కిషన్ రెడ్డీ. తెలంగాణ అభివృద్ధికి అడ్డం పడ్డోనికి పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పునిస్తారు. మీరు ఒక్కరూ కూడా బతికి బట్టకట్టి ఢిల్లీకి పోరు. ఎనిమిది మంది ఎంపీలను గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా?’’ అంటూ నిప్పులు చెరిగారు.

ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రాజకీయాలు చేద్దామన్న సీఎం రేవంత్.. అప్పటివరకు డెవలప్ మెంట్ మీద ఫోకస్ చేద్దామన్న హితవు పలికారు. రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు అడగాల్సిన అవసరం లేదా? గోదావరి.. సింగూరు జలాలు హైదరాబాద్ కు తేవాల్సిన అవసరం లేదా? మూసీ ప్రక్షాళనకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురమ్మంటే తీసుకురారరన్న ముఖ్యమంత్రి.. ‘‘పొంకనాల పోసిగానికి మూడు ఎడ్లుంటే ముప్ఫై ఆరు దొడ్లున్నాయని. అయ్యా కిషన్ రెడ్డి.. నువ్వు ఎంత మొనగాడివో.. ఎంత లడాయి కోతివో తెలంగాణవాళ్లకు తెలుసు. తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించటానికి అడ్డుపడుతున్నది నువ్వు కాదా? గోదావరి జలాలు 20 టీఎంసీలు నగరానికి తెచ్చే పనులకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది నువ్వు కదా? మోడీ సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అబ్బా ఆహా.. ఓహో అంటావు. మనకున్న మేూసీని ప్రక్షాళన చేసుకోవద్దా?’ అంటూ మాటలతో కడిగిపారేసినంత పని చేశారు ముఖ్యమంత్రి రేవంత్.

గడిచిన రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎంపీలు ఏం చేశారో శాసనసభలో చర్చిద్దామన్న ముఖ్యమంత్రి రేవంత్.. బీజేపీ నేతలు తప్పించుకోవాలని చూస్తే.. పొగబెట్టి ఎలుకను బయటకు ఎలా తీసుకురావాలో తమ కార్యకర్తలకు బాగా తెలుసన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో చిన్న వార్డు మెంబర్ ను గెలిపించుకోవాలన్నా మోడీ ముఖం చూపించి ఓట్లు అడిగే దయనీయ పరిస్థితి బీజేపీ నేతలదిగా విరుచుకుపడ్డారు. మొత్తంగా కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్.. హరీశ్ రావులను మాత్రమే ఇంతలా టార్గెట్ చేసిన రేవంత్.. తాజాగా మాత్రం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.