తోలు తీస్తా మాటకు.. నోటితోనే తాట తీసిన రేవంత్
మాటలతో తాట తీయటం సాధ్యమా? అన్న సందేహానికి సమాధానం చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
By: Tupaki Desk | 25 Dec 2025 2:02 PM ISTమాటలతో తాట తీయటం సాధ్యమా? అన్న సందేహానికి సమాధానం చెప్పేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తనను ఉద్దేశించి నాలుగు రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తోలు తీస్తానన్న మాటకు.. తీవ్రస్థాయిలో కౌంటర్ వేశారు ముఖ్యమంత్రి రేవంత్. ఓవైపు పదునైన మాటలు.. మరోవైపు వ్యంగ్య వ్యాఖ్యలతోతోలు తీస్తానన్న మాటకు.. వంద మాటలు మాట్లాడిన రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మాటకు మాట అన్నది కాక.. మాటకు వంద మాటలన్నట్లుగా ఆయన రియాక్షన్ ఉందని చెప్పాలి. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబం అధికారంలోకి రాదన్న రేవంత్.. తాను రానివ్వబోనని కొడంగల్ సాక్షిగా శపధం చేసిన వైనం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మూడింట రెండింతల సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. 2029 ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 80కు పైగా సీట్లు గెలుచుకుంటామన్న ఆయన.. ఒకవేళ పునర్విభజన జరిగి 153 నియోజకవర్గాలు అయిన పక్షంలో వంద సీట్ల మార్కు దాటతామని చెప్పాలి. ఇది తన సవాలుగా ఆయన పేర్కొన్నారు.
తాను చెప్పిన విషయాల్ని కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావు.. వినోద్ రావు.. దయాకర్ రావులు రాసిపెట్టుకోవాలన్నారు. ఇటీవల ముగిసిన పంచాయితీ ఎన్నికల్లో గెలిచిన వారికి సంబంధించి నారాయణపేట జిల్లా కోస్గిలో కొడంగల్ నియోజకవర్గ సర్పంచులు.. ఉప సర్పంచులు.. వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం వేళ గులాబీ బాస్ కేసీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు వంద రెట్లు ఘాటుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
రెండేళ్ల తర్వాత ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్.. తన తోలు తీస్తానని వ్యాఖ్యలు చేశారని.. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజునే కింద పడి నడుము విరిగిందన్నారు. ‘కేసీఆర్ ఫామ్ హౌజ్ నే బందిఖానాగా మార్చుకున్నారు. వాస్తవానికి ఆయనను జైలుకు పంపినా ఇదే జరుగుతుంది. పైగా ప్రభుత్వానికి అదనంగా తిండి ఖర్చు దండుగ. రెండేళ్లుగా కేసీఆర్ తోలు తీయటమే నేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన్ను షేక్ పేట మటన్ కొట్టు మస్తాన్ దగ్గర ఉద్యోగం ఇప్పిస్తా’’ అంటూ నిప్పులు చెరిగారు. తాను దుబాయ్ కు పంపిస్తానని దొంగ వీసాల వ్యాపారం చేయలేదని మండిపడ్డారు.
తాను మాట్లాడాలే కానీ.. తన మాటలకు కేసీఆర్ తట్టుకోలేరని.. రాయి కట్టుకొని మల్లన్నసాగర్ లో దూకుతారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీదా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను గుంటూరులో చదువుకోలేదని.. అమెరికాలో బాత్రూంలు కడగలేదన్నారు. అయ్య పేరు చెప్పుకొని మంత్రి పదవి తెచ్చుకున్న కేటీఆర్ అహంభావంతో మాట్లాడుతున్నారన్నారు. తనతో మాట్లాడటమంటే అమెరికాలో బాత్రూంలు కడిగినట్లు అనుకుంటున్నావా? అంటూ మండిపడ్డ సీఎం రేవంత్.. ‘‘పేడమూతి బోడి లింగం. నువ్వు కూడా మాట్లాడతావా? నల్లమల రైతు కుటుంబం నుంచి వచ్చా. కష్టపడి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యా. నువ్వు మాట్లాడతావా?’’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో తనపై 181 కేసులు పెట్టించారని.. తాను పగ సాధించాలనుకుంటే రాష్ట్రానికి నష్టం కలుగుతుందని.. వాళ్ల పాపాన వాళ్లే పోతారని తాను ఊరుకున్నానని చెప్పారు. తాను కక్ష సాధించాల్సిన పని లేదని.. కేసీఆర్ కు ఫామ్ హౌసే బందిఖానాగా పేర్కొన్నారు. ‘‘అక్కడ ఉన్నది నా పోలీసులే. బీఆర్ఎస్.. కేసీఆరర్ చరిత్ర ఇక గతమే. భవిష్యత్తు అంతా కాంగ్రెస్ దే. మొన్న జూబ్లీహిల్స్.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ.. ఇప్పుడు 7335 సర్పంచి స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినా వారికి బుద్ధి రావట్లేదు’’ అంటూ మండిపడ్డారు.
రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ పెద్ద మనిషిగా.. నాలుగు మంచి మాటలు చెబుతారనుకుంటే.. సోయి లేని మాటలు.. స్థాయిలేని విమర్శలు చేస్తున్నారన్న ముఖ్యమంత్రి రేవంత్.. ‘‘నలభై ఏళ్ల అనుభవంతో మాట్లాడే మాటలేనా అవి? పది మందిని వెనకేసుకొని మాట్లాడటం కాదు. అసెంబ్లీకి రండి. ఏ అంశమైనా చర్చించేందుకు సిద్ధం. కాళేశ్వరం మీద చర్చిద్దామా? క్రిష్ణా.. గోదావరి జలాలపైనా? లేదంటే ఫోన్ ట్యాపింగ్ పైనా? మీ గాండ్రిపులకు.. బెదిరింపులకు భయపడేది లేదు’’ అంటూ సీరియస్ అయ్యారు.
తన భర్త పోన్ ట్యాప్ అయ్యిందని సొంత చెల్లే చెబుతుంటే సమాధానం చెప్పలేని కేటీఆరర్.. తనకు సవాలు విసురుతున్నారన్నారు. ‘ఆస్తి కోసం సొంత చెల్లినే మెడపెట్టి బయటకు పంపినోళ్లు కూడా మాట్లాడుతున్నారు. నేనేమీ అయ్యపేరు చెప్పి మంత్రి పదవి తీసుకోలేదు. జడ్పీటీసీ నుంచి ఒక్కో మెట్టు ఎదిగి ఈ స్థాయికి వచ్చా’’ అంటూ విరుచుకుపడ్డారు.
తాను మర్యాదగా మాట్లాడదామంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా అంటున్నారు. తండ్రేమో రియల్ ఎస్టేట్ దందా అంటాడని.. కొడుకేమో రియల్ ఎస్టేట్ లేదంటాడని.. వారి మాటలే వారికి సరిపోవటం లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘తొడుక్కోవటానికి చెప్పులు.. వేసుకోవటానికి మంచి బట్టలు లేని వాళ్లకు రూ.వేల కోట్ల ఆస్తులు వచ్చాయి తప్ప పాలమూరుకు నీళ్లు రాలేదు. ఒకరికి ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫాంహౌస్.. మరొకరికి జన్వాడలో వంద ఎకరాల ఫాంహౌస్.. అల్లుడికి మొయినాబాద్ ఫాంహౌస్ లు వచ్చాయి. టీవీలు.. పేపర్లు.. వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. కానీ.. పాలమూరులో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. 2009లో పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎంపీని చేస్తే.. పాలమూరు రంగారెడ్డి, కేఎల్ఐ.. ఎస్ఎల్ బీసీ.. భీమా.. నెట్టెంపాడు.. కల్వకుర్తి.. మక్తల్ - కొడంగల్ - నారాయణపేట.. ఇలా ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదు’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం ద్వారా.. కేసీఆర్ అండ్ కోను ఆత్మరక్షణలో పడేశారని చెప్పాలి.
