రిమ్‌జిమ్ రిమ్ జిమ్ కాదు.. 'ఎలక్ట్రిక్' హైదరాబాద్..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చిన్న చినుకుకు మోకాల్లోతు నీటిలో చిక్కుకుంటోంది.
By: Tupaki Desk | 29 Jun 2025 11:02 AM IST``తెలంగాణ రాజధాని హైదరాబాద్ చిన్న చినుకుకు మోకాల్లోతు నీటిలో చిక్కుకుంటోంది. ఇక, వాహనాల కారణంగా వెలువడు తున్న కార్బన్ డైయాక్సైడ్‌తో భాగ్యనగరం కాలుష్య కోరల్లోనూ చిక్కుకుంటోంది. ప్రభుత్వాలు మారినా ఈ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు.``ఇదీ.. కొన్నాళ్ల కింద కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇచ్చిన నివేదిలో భాగ్యనగరానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఇవి పెద్ద ఎత్తున చర్చకు వచ్చాయి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా.. మౌనంగానే ఉందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రిమ్‌జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్‌ను ఇకపై ఎలక్ట్రిక్ హైదరాబాద్‌గా మార్చనున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ కాలుష్య నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌ను ఎలక్ట్రిక్ హైదరాబాద్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నామని.. కొన్ని మాసాల్లోనే అందరికీ దీని ఫలితం తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం హైదరాబాద్ రేడియస్‌లో తిరుగుతున్న అన్ని డీజిల్ బస్సులను నగరంలోకి అనుమతించేది లేదని చెప్పారు. అదేసమయంలో మూడు వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకువస్తున్నట్టు చెప్పారు. అయితే.. ఈప్రక్రియ పూర్తయ్యేందుకు మూడు మాసాల సమయం పడుతుందని వెల్లడించారు.
అదేవిధంగా ఎలక్ట్రిక్ బైకులు, ఆటోలను భారీ స్థాయిలో ప్రోత్సహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. వాటికి అన్ని విధాలా పన్నులను మినహాయించనున్నట్టు ముఖ్యమంత్రి వివరించారు. అంతేకాదు.. కాలుష్య నియంత్రణపై ప్రజలకుఅ వగాహన కల్పించే ఫ్రీలాన్స్ జర్నలిస్టులను కూడా ప్రోత్సహిస్తామని , ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలను కూడా వాడుకుంటామన్నారు. ఇక, నగరంలో చిన్న చినుకు పడితేనే మునిగిపోతున్న పరిస్థితి చూసి చాలా ఆవేదనగా ఉందన్న రేవంత్ రెడ్డి.. దీనినిసాధ్యమైనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాలు మునిగిపోతున్నతీరును ఈ సందర్భంగా ఆయన వివరించారు. అలాంటి పరిస్థితి రాకుండా.. రాష్ట్రాన్ని 3 లేయర్లుగా విభజించి నీటి నియంత్రణ, మురుగు కాల్వల ఆధునీకరణకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. తద్వారా భాగ్యనగరాన్ని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
