50 శాతం సీట్ల పెంపు.. అయినా దక్షిణాదికి నష్టమా? రేవంత్ పక్కా విశ్లేషణ
డీలిమిటేషన్ లో పార్లమెంటు నియోజకవర్గాలను 50 శాతం పెంచినా దక్షిణాదికి అన్యాయమే జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Political Desk | 31 March 2026 1:59 PM ISTడీలిమిటేషన్ లో పార్లమెంటు నియోజకవర్గాలను 50 శాతం పెంచినా దక్షిణాదికి అన్యాయమే జరుగుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే దక్షిణాది నష్టపోతుందన్న ఆందోళనలతో దేశవ్యాప్తంగా ఒకే విధానంలో సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. దీనివల్ల కూడా దక్షిణాదికి అన్యాయమే జరుగుతుందని టీ.సీఎం రేవంత్ రెడ్డి విశ్లేషిస్తున్నారు. తన వాదనకు మద్దతుగా ఆయన చెబుతున్న లెక్కలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటివరకు డీలిమిటేషన్ ప్రక్రియపై రకరకాల విశ్లేషణలు, ఊహాగానాలు వినిపిస్తుండగా, రేవంత్ రెడ్డి మాత్రం వాటికి పూర్తి భిన్నమైన లెక్కలు చెప్పి ఒక్కసారిగా హీట్ పెంచేశారు.
పునర్విభజనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్లేషణలు దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను 50 శాతం పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ప్రస్తుత ప్రాతినిధ్యానికి తగినట్లే ప్రాధాన్యం లభిస్తుందనే వాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుబడుతున్నారు. ఇందుకోసం ఆయన చెబుతున్న లెక్క ఆసక్తికర చర్చకు తెరలేపింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం సీట్ల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కసీటు రాకపోయినా ఉత్తరాదిలోని ఆరేడు రాష్ట్రాల మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం దక్షిణాదిలో 130 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయని, 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాల సీట్లు 195కి పెరుగాయని అదే ఉత్తరాదిలో మాత్రం ప్రస్తుతం ఉన్న 413 సీట్లు 620 పెరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల అవసరం లేకుండా, గుజరాత్, బిహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో మెజార్టీతో కేంద్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య సీట్ల వ్యత్యాసం 283గా ఉంటే పెంపు తర్వాత ఈ తేడా 407కు పెరుగుతుందని సీఎం ఎత్తిచూపుతున్నారు.
దీనివల్ల కేంద్రం ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలకు కనీస ప్రాధాన్యం తగ్గిపోతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు అవసరం లేనప్పుడు ప్రస్తుతం కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ వంటి నేతలకు భవిష్యత్తులో ఎలాంటి ప్రాధాన్యం దక్కదని సీఎం హెచ్చరిస్తున్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు 50 శాతం సీట్ల పెంపు వల్ల దక్షిణాది పౌరులు దేశంలో రెండో తరగతి పౌరులుగా మారుతారని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది క్రూరమైన మెజార్టీ కోసం జరుగుతున్న ప్రయత్నంగా సీఎం ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు మేల్కోవాలని అవగాహన పెంచుకుని కేంద్రంపై పోరాడాలని సీఎం పిలుపునిస్తున్నారు. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో ఆర్థిక, రాజకీయ పరమైన అంతరం నియంతృత్వానికి దారితీస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో సీమాంధ్రకే మెజార్టీ సీట్లు ఉండేవని, అందుకే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చి తెలంగాణ ఏర్పడిందని ఆయన ఉదహరించారు. ఈ పోలిక దీర్ఘకాలంలో తీవ్రమైన సమస్యకు ప్రతిబింబంగా సీఎం చూస్తున్నారా? అన్న చర్చకు కారణమవుతోంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే లోక్ సభ సీట్ల సంఖ్య విషయంలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న అంతరం అలాగే కొనసాగిస్తూ పునర్విభజన జరగాలని సీఎం అభిప్రాయపడ్డారు.
