Begin typing your search above and press return to search.

ఆదాయానికి తగ్గట్టే ప్రాతినిధ్యం.. సీఎం రేవంత్ కీలక సూచన!

ఇక దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆర్థిక రాజధానులు అని, ఉత్తరాది రాష్ట్రాలు కేవలం రాజకీయ రాజధానులు మాత్రమేనంటూ రేవంత్ రెడ్డి సూత్రీకరిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   14 April 2026 12:00 PM IST
ఆదాయానికి తగ్గట్టే ప్రాతినిధ్యం.. సీఎం రేవంత్ కీలక సూచన!
X

పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లను పెంచాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని టీ.సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. 50 శాతం సీట్లు పెరగడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం ఏమీ లేదని, ఉత్తరాది రాష్ట్రాలు రాజకీయంగా మరింత బలపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం సీట్ల పెంపునకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రాలు సంపాదిస్తున్న ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎక్కువ ఆదాయం వచ్చే రాష్టాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిపాదన సంచలనం రేపుతోంది.

రాష్ట్రాల వారీగా 50 శాతం చొప్పున పెంచితే 272 సీట్లు అదనంగా పెరుగుతాయని, అయితే ఇందులో సగం సీట్లను జీఎస్డీపీ అంటే తలసరి ఆదాయం ఎక్కువగా ఉండే రాష్ట్రాలకు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిస్తున్నారు. మిగిలిన సగం సీట్లను ప్రోరేటా ప్రకారం అన్ని రాష్ట్రాలలో పెంచాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారు. ఈ మేరకు హైబ్రిడ్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇలా చేయడం వల్ల ఆదాయం తెచ్చిపెడుతున్న రాష్ట్రాలను గౌరవించినట్లు అవుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం చేసిన ఈ తాజా ప్రతిపాదన రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాల్లోనే ఆదాయం ఎక్కువగా వస్తుందని, కేటాయింపులు మాత్రం ఆ స్థాయిలో ఉండటం లేదని ఇప్పటివరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. తమ ఆదాయాన్ని దేశంలో ఇతర రాష్ట్రాలకు పంచుతున్నారని, కానీ, తమకు ఆ స్థాయిలో నిధులు రావడం లేదని ఆయా రాష్ట్రాలకు చెందిన నేతలు తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. ఇప్పుడు పార్లమెంటు సీట్ల విషయంలోనూ సీఎం రేవంత్ సీఎం రేవంత్ ఆ ప్రాతిపదికనే సూచనలు చేస్తున్నారని అంటున్నారు.

ఇక దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆర్థిక రాజధానులు అని, ఉత్తరాది రాష్ట్రాలు కేవలం రాజకీయ రాజధానులు మాత్రమేనంటూ రేవంత్ రెడ్డి సూత్రీకరిస్తున్నారు. పన్నులు కట్టి సలామ్ కొట్టడానికి తాము వ్యతిరేకమని కేంద్రానికి స్పష్టం చేస్తున్నారు దేశ జీడీపీలో 53 శాతం ఆదాయం నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళుతుందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. దేశానికి ఆదాయంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దక్షిణాది రాష్ట్రాలు కల్పిస్తున్నాయని, అలాంటి రాష్ట్రాలను ఎలా శిక్షిస్తారని అంటున్నారు. తన ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా ఆలోచించాలని, అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రతిపాదిస్తున్న 50 శాతం పెంపు చెప్పేందుకు సహజ న్యాయంగా ఉన్నప్పటికీ, వాస్తవంలో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ప్రస్తుతం 80 సీట్లు ఉంటే, దక్షిణాది రాష్ట్రమైన కేరళంలో 20 సీట్లు ఉన్నాయని, 50 శాతం పెంపు తర్వాత యూపీలో 120, కేరళంలో 30 సీట్లు అవుతాయని, ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల మధ్య 60 సీట్ల వ్యత్యాసం ఉంటే పునర్విభజన తర్వాత ఈ తేడా 90 సీట్లకు పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అదేవిధంగా పుదుచ్చేరితో కలుపుకుని దక్షిణాదిలో ప్రస్తుతం 130 సీట్లు ఉంటే, ఉత్తరాదిలో 413 సీట్లు ఉన్నాయని, ప్రస్తుత అంతరం 283 ఉంటే, 50 శాతం పెంపు ప్రతిపాదన వల్ల దక్షిణాది సీట్ల సంఖ్య 195, ఉత్తరాది సీట్లు 621కి చేరుకుంటాయని, అప్పుడు తేడా 426కి పెరుగుతుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా దేశవ్యాప్తంగా అందరికీ సమాన ప్రాతినిధ్యం దక్కాలంటే తాను ప్రతిపాదిస్తున్న హైబ్రిడ్ విధానంపై చర్చ జరగాలని సీఎం సూచిస్తున్నారు.