Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ చెప్పిన బీఆర్ఎస్ మైనింగ్ చిట్టా

అయితే.. ఇక్కడే దిద్దుకోలేని తప్పు చేశారు హరీశ్. ఒక వేలి ఎత్తు చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మనల్ని ప్రశ్నిస్తాయన్న చిన్న లాజిక్ ను హరీశ్ మిస్ అయిన పరిస్థితి

By:  Garuda Media   |   29 March 2026 11:30 AM IST
సీఎం రేవంత్ చెప్పిన బీఆర్ఎస్ మైనింగ్ చిట్టా
X

అందుకే అంటారు తాటిని తన్నేటోడు ఒకడుంటే.. వాడి తలను తన్నేటోడు మరొకడు ఉంటాడని. ప్రత్యర్థిని అంచనా వేయటం.. అతడి శక్తియుక్తులు..సామర్థ్యాలపై అవగాహనలోని లెక్కలు ఏ మాత్రం తప్పినా.. దానికి చెల్లించాల్సిన మూల్యం ఉంటుంది. అందునా.. రాజకీయంలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా.. శనివారం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ నేతలు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ తో పాటు.. పొంగులేటి కుటుంబ సభ్యులు మైనింగ్ కు సంబంధించి బోలెడన్ని ఆరోపణల్ని సంధించారు మాజీ మంత్రి హరీశ్.

అయితే.. ఇక్కడే దిద్దుకోలేని తప్పు చేశారు హరీశ్. ఒక వేలి ఎత్తు చూపిస్తే.. మిగిలిన నాలుగు వేళ్లు మనల్ని ప్రశ్నిస్తాయన్న చిన్న లాజిక్ ను హరీశ్ మిస్ అయిన పరిస్థితి. ఇదే విషయాన్ని గుర్తించిన సీఎం రేవంత్ రంగంలోకి దిగటమే కాదు.. హరీశ్ వాదనకు కౌంటర్ అటాక్ మొదలు పెట్టటమేకాదు.. సభలో ఆత్మరక్షణలో పడిన కాంగ్రెస్ మంత్రులకు ఊరట కలిగించటమే కాదు.. ఎవరైతే తమ మీద దాడికి దిగారో సదరు హరీశ్ మీద మాత్రమే కాదు.. గులాబీపార్టీకి చెందిన పలువురు పెద్ద తలకాయలు సైతం తల పట్టుకునేలా చేశారు సీఎం రేవంత్.

మంత్రి పొంగులేటి మైనింగ్ మీద విమర్శలు..ఆరోపణలు చేసిన మాజీమంత్రి హరీశ్ నోటి వెంట మాట రాకుండా చేయటమే కాదు.. చివరకు వాకౌట్ చేసే వరకు వెళ్లిన పరిస్థితికి కారణం..బీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలకు సంబంధించి మైనింగ్ వ్యాపారాల చిట్టా విప్పిన సీఎం తీరుతో విషయం మొత్తం మారిపోయింది. ఇంతకూ సీఎం రేవంత్ చెప్పిన బీఆర్ఎస్ నేతల మైనింగ్ అంశాల్ని చూస్తే..

- జోగినిపల్లి సంతోష్ రావు

సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మైనింగ్ కు సంబంధించి సంతోష్ రావు..ఆయన తండ్రి రవీందర్ రావు

- గంగుల కమలాకర్

మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబానికి చెందిన శిరీష జియో గ్రానైన్స్, శ్వేత గ్రానైట్ సంస్థల ద్వారా జరిగిన అక్రమాల సంగతేంటి?

- వద్దిరాజు రవిచంద్ర

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్స్ వ్యవహారం

- హరీశ్ సోదరుడు

హరీశ్ రావు సోదరుడికి చెందిన మిడ్ వెస్ట్ గ్రానైట్ కంపెనీలోని అక్రమాలు

- కేటీఆర్ - హరీశ్ రావు

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లలో ఐదేళ్లు చొప్పున మైనింగ్ శాఖను నిర్వహించిన కేటీఆర్, హరీశ్ రావులేన మొత్త అక్రమాలకు బాధ్యులు. నెలకు రూ.వెయ్యి కోట్ల మేర అక్రమ సంపాదన జరిగింది.

- జోగినిపల్లి రవీందర్ రావు

మాజీ ఎంపీ సంతోష్ రావు తండ్రి రవీందర్ రావు కు చెందిన మైనింగ్ అంశాలు

- గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెర్వు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలకు చెందిన మైనింగ్ కార్యకలాపాలు

- కేసీఆర్

నేరుగా మైనింగ్ అక్రమాలకు పాల్పడలేదు.కానీ.. ఆయన ప్రభుత్వ హయాంలోనే జరిగింది కదా?మరి కేసీఆర్ బాధ్యత వహించాలి కదా? అంటూ ప్రశ్నించిన సీఎం రేవంత్.. అనూహ్య రీతిలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్ కు చెందిన పలువురు అగ్రనేతలు.. వారి కుటుంబ సభ్యులు.. బంధువుల ఇసుక దందా, మైనింగ్ అక్రమాల మాటేంటి? అందుకే 2014 జూన్ 2 నుంచి ఇప్పటివరకు జరిగిన అన్ని మైనింగ్ లీజులు.. అక్రమాలపై సీబీ సీఐడీ విచారణకు జరిపి..వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు.

మంత్రి పొంగులేటి మైనింగ్ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వాన్నిఇరుకున పెడుతుందని భావించిన బీఆర్ఎస్ నేతలు.. చివరకు తమ వద్దకు వచ్చి ఆగటమే కాదు.. అనూహ్య రీతిలో సీబీసీఐడీ విచారణను ఎదుర్కొనాల్సి రావటంతో ఉలిక్కిపడ్డారు. అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రదర్శించిన దూకుడు బీఆర్ఎస్ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుగా తమ పరిస్థితి తయారైందని బీఆర్ఎస్ నేతలు లోగుట్టుగా తమ వేదనను వ్యక్తం చేయటం గమనార్హం.