రేవంత్ బల్ల గుద్ది చెబుతున్నారు..లెక్క కరెక్టేనా ?
తెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో రెండు టెర్ములు తనదే అధికారం అని ప్రతీ సభలో చెబుతూ ఉంటారు. రాసి పెట్టుకోండి అని ఆయన అంటున్నారు.
By: Satya P | 14 July 2026 8:00 AM ISTతెలంగాణా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరో రెండు టెర్ములు తనదే అధికారం అని ప్రతీ సభలో చెబుతూ ఉంటారు. రాసి పెట్టుకోండి అని ఆయన అంటున్నారు. ఇక తాజాగా ఆయన ఖమ్మం సభలో అయితే మీడియాకు నంబర్ చెప్పి మరీ మాకు 2029 లో వచ్చే సీట్లు ఇవ్వే లెక్క కరెక్ట్ అని పక్కాగా చెప్పారు. మాకు 117 సీట్లు వస్తాయని ఆయన అన్నారు. తెలంగాణాలో సీట్లు 182 దాకా పెరుగుతాయని అందులో 117 ఒక్క కాంగ్రెస్ కే సొంతంగా వస్తాయని ఆయన స్పష్టం చేశారు.
అంచనాలు వేసుకునే :
ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డిని ఎవరు తక్కువగా అంచనా వేసినా పప్పులో కాలేసినట్లే అని అంటున్నారు. అలాగే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేతలు లైట్ తీసుకున్నారు. దానికి గానూ ఏకంగా భారీ మూల్యం చెల్లించి గద్దె దిగాల్సి వచ్చింది. మరి ఇపుడు చూస్తే రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నారు. ప్రభుత్వం నడుపుతున్నారు. పైగా కాంగ్రెస్ అధినాయకత్వం వద్ద ఆయనకు మంచి పేరు ఉంది. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆయనకే ఓటు వేస్తున్నారు. దాంతో మరో రెండు సార్లు కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకుని వస్తామని రేవంత్ తన వద్ద ఉన్న అంచనాలతోనే చెబుతున్నారు.
సీట్లు పెరిగితే కనుక :
తెలంగాణాలో ప్రస్తుతం 119 సీట్లు ఉన్నాయి. అవి ఏకంగా 182 దాకా అవుతాయని రేవంత్ రెడ్డి లెక్క కడుతున్నారు. ఇలా సీట్లు మరో డెబ్బై దాకా పెరిగితే అది కాంగ్రెస్ ప్రభుత్వానికే అనుకూలిస్తుంది అని ఆయన భావిస్తున్నారు. ఎపుడూ అధికారంలో ఉండే పార్టీకే ఈ సీట్ల పెరుగుదల అడ్వాంటేజ్ గా ఉంటుంది అని అంటున్నారు. 2009 లో అసెంబ్లీ సీట్ల పునర్ విభజన వైఎస్సార్ కి బాగా కలిసి వచ్చింది. ఇపుడు కూడా రేవంత్ రెడ్డి అదే జరుగుతుందని భావిస్తున్నారు అంటున్నారు.
ప్రజలకు చేరువ అవుతూ :
రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో అంతా మద్దతుగానే ఉన్నారు. పెద్దగా ఇబ్బందులు లేవు, ఇక ప్రతిపక్షంలో అయితే గట్టి పోటీ లేదని భావిస్తున్నారు. ఆయనకు సరిసాటి నాయకుడు కేసీఆర్ అయితే పూర్తిగా ఫాం హౌజ్ కే పరిమితం అయ్యారు. కేటీఆర్ హరీష్ రావులను అయితే రేవంత్ రెడ్డి తన మాటలతో విమర్శలతో గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. తన మాటకారితనంతో జనాలకు చేరువ అవుతున్నారు. ఇక ప్రజల వద్దకు తరచుగా వెళ్తున్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ప్రభుత్వ పధకాలను అన్నీ జనం మధ్యలోనే ప్రకటిస్తున్నారు. అందులో అధిక భాగం మహిళలకు కేటాయిస్తున్నారు. దాంతో మహిళా ఓటర్ల మద్దతు తనకు గట్టిగా ఉంటుందని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు, వారికి పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలను అమలు చేశామని ఉచిత గ్యాస్ సిలిండర్లు, రుణాలు, ఇందిరమ్మ చీరలు, ఉచిత బస్సులు, ఉచిత కరెంట్, డ్వాక్రా రుణాలు ఇవన్నీ కూడా గంపగుత్తగా ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆయన భావిస్తున్నారు.
వ్యతిరేక ఓట్ల చీలిక :
ఇక రాజకీయంగా చూస్తే వ్యతిరేక ఓట్లు భారీగా వచ్చే ఎన్నికల్లో చీలిపోతాయని కూడా రేవంత్ రెడ్డి అంచనా కడుతున్నారు. విపక్షంలో బీజేపీ బీఆర్ఎస్ రెండూ పోటా పోటీగా ఉన్నాయి. ఈ రెండూ కలిసేది లేదు అని అంటున్నారు. కలుస్తాయని అందుకే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఇదంతా వ్యూహాత్మకం అని అంటున్నారు. ఈ రెండు పార్టీ కలిసినా అప్పటికి అది బూమరాంగ్ అవుతుందని విడిగా పోటీ చేస్తే కనుక కచ్చితంగా యాంటీ ఇంకెంబెన్సీని పంచుకుంటాయని దాంతో మరోసారి గెలుపు బాట కాంగ్రెస్ దే అని రేవంత్ రెడ్డి పూర్తి ధీమాతో ఉన్నారు అని అంటున్నారు.
