వైజాగ్ కూడా ఎదుగుతోంది బాసూ !
ఈ ప్రపంచంలో ఎన్నో చిన్న దేశాలు ఉన్నాయి. భారత్ లోని కొన్ని నగరాల పాటి చేయని దేశాలూ ఉన్నాయి. అంత మాత్రం చేత వాటిని దేశాలు కావు అని అనగలమా అని కూడా ప్రశ్నిస్తున్నారు.
By: Satya P | 16 Jun 2026 7:00 AM ISTవైజాగ్ ఎంతుంటుంది అని చాలా సెటైరికల్ గా ప్రశ్నించారు తెలంగాణా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అవును వైజాగ్ ఎంత ఉంటుంది అని ఇపుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఎంత ఉండాలో అంతే ఉంటుంది కదా అన్నది బదులుగా వస్తోంది. అయినా ఏ ఒక్క నగరాన్ని మరో నగరంతో ఎలా పోల్చుతారు, ఎత్తు బరువు లావు, పొడవు ఇవేనా ప్రమాణాలు అని మేధావులు సైతం విస్తు బోతున్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో చిన్న దేశాలు ఉన్నాయి. భారత్ లోని కొన్ని నగరాల పాటి చేయని దేశాలూ ఉన్నాయి. అంత మాత్రం చేత వాటిని దేశాలు కావు అని అనగలమా అని కూడా ప్రశ్నిస్తున్నారు.
అది సిటీ ఆఫ్ డెస్టినీ :
ఏ దేశానికి తగినట్లుగా అక్కడ ప్రత్యేకత ఉంటుంది, అలాగే విలక్షణత కూడా ఉంటుంది. విశాఖనే తీసుకుంటే సిటీ ఆఫ్ డెస్టినీ అని అంటారు. ఇది చాలా ఏళ్ళ నుంచి ప్రాచుర్యంలో ఉన్న మాట. విశాఖ మహా నగరం అని కూడా అంటారు. అదే సమయంలో మరో నగరంలో పోలిక కూడా విశాఖకు వద్దు అని చెప్పేవారూ ఉన్నారు. విశాఖ తన సొంత అస్తిత్వం తో అలాగే ఉంటూ వస్తోంది. టూరిస్టులకు స్వర్గధామంగా విశాఖ ఉంది. ఈ ప్రపంచంలో అనేక టూరిస్టు స్పాట్స్ ఉన్నాయి. వాటిలో విశాఖకూ ముందో వెనకో ఒక చోటు ఉంది. విశాఖ ఎంతుంటుంది అంటే అంతు లేని కడలి అంత ఉంటుంది అని అంతే సెటైరికల్ గా జవాబు చెప్పవచ్చు. ఎత్తైన పచ్చని కొండలు ఉంటాయని కూడా చెప్పవచ్చు. అయినా ఇంతకీ రేవంత్ రెడ్డి ఎందుకీ సెటైర్లు వేశారు అంటే దానికీ ఒక మ్యాటర్ ఉంది మరి.
మెట్రో ఫేజ్ టూ కోసం :
హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ కి ఎందుకు కేంద్రం అనుమతి ఇవ్వదు అని తెలంగాణా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇది సబబైన మాటే. కేంద్రాన్ని ఆయన అడిగి తీరాల్సిందే కూడా. అదే సమయంలో ఆయన దేశంలోని పలు నగరాల ప్రస్తావన తెచ్చారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ మెట్రోకి అనుమతి ఇచ్చారు, నిధులు ఇచ్చారని అన్నారు. చివరికి వైజాగ్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని అన్నారు. చివరికి వైజాగ్ అనడంలోనే పెదవి విరుపు ఉంది. ఒక వ్యంగ్యోక్తి కూడా ఉంది అని వైజాగ్ ప్రేమికులు అంటున్నారు.
హైదరాబాద్ లో ఎంత :
అక్కడితోనూ రేవంత్ రెడ్డి ఆగలేదు, హైదారాబాద్ తో వైజాగ్ ని పోల్చారు. అది జూబ్లీహిల్స్, మాదాపూర్ కలిపితే ఎంతుంటుందో అంతే ఉంటుందిని కొలతలు లెక్కలు పక్కాగా చెప్పేశారు. హైదరాబాద్ విశ్వనగరం అని అయినా మెట్రో ఫేజ్ టూ కి అనుమతించరా అని ఆగ్రహించారు. ఇదంతా కేంద్రం వివక్ష అని కూడా మండిపడ్డారు. మెట్రో విస్తరణ ఖర్చు కూడా తెలంగాణా సర్కార్ భరిస్తుంది అన్నా కూడా కేంద్రం ఇవ్వకపోవడం బాధాకరం అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయంగా తమ పార్టీకి నష్టం జరుగుతుందనే కేంద్రం ఇవ్వలేదని తేల్చారు.
వైజాగ్ కూడా ఎదుగుతోంది :
ఏ నగరం అయినా నెమ్మదిగా ఎదుగుతుంది. విశాఖ సైతం అందులో భాగమే. ఈ రోజున విశాఖ అభివృద్ధి వేగం చాలా జోరు చేస్తోంది అని అంతా గుర్తు చేస్తున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పూర్తి అయితే విశాఖ విజయనగరం రెండు జిల్లాలూ ఒకటిగా మారిపోయే రోజు దగ్గరలోనే ఉంది. ఆ లెక్కన విశాఖ ఇప్పటికి నాలుగింతలు ఎదగడం ఖాయం. ఇంకో వైపు ఉమ్మడి జిల్లాలో అటు పాయకరావుపేట వరకూ పారిశ్రామిక క్లస్టర్లు వస్తున్నాయి. మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తోంది. తొందరలో మినీ రింగ్ రోడు వస్తుంది. ఫ్యూచర్ లో మరిన్ని రింగ్ రోడ్లు కూడా వస్తాయని గుర్తు చేస్తున్నారు. విస్తరణకు ఎంతో అవకాశం ఉన్న విశాఖకు మెట్రో ప్రాజెక్టుల అవసరం ఎందుకు లేదూ అని ప్రశ్నిస్తున్న వారూ ఉన్నారు. సో వైజాగ్ ఎంతుంది అని అన్న వారే రేపటి రోజున ఈ ఎదుగుదలను చూస్తూ ఉండిపోవాల్సి వస్తుందేమో.
