కాంగ్రెస్ సీఎం.. ఎన్డీఏ నేతలతో స్నేహం! రేవంత్ రెడ్డి సరికొత్త పాలిటిక్స్
జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఎన్డీఏ నేతలతో ఆయన నెరుపుతున్న స్నేహం జాతీయ మీడియాను విశేషంగా ఆకర్షిస్తోంది.
By: Tupaki Desk | 19 April 2026 1:00 AM ISTజాతీయ రాజకీయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఎన్డీఏ నేతలతో ఆయన నెరుపుతున్న స్నేహం జాతీయ మీడియాను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రధానంగా కేంద్రం తీసుకువచ్చిన డీలిమిటేషన్ బిల్లుపై తొలి నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర దక్షిణాది సీఎంలను కార్యోన్ముఖులు చేశారని అంటున్నారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా రేవంత్ రెడ్డికి ప్రాధాన్యం పెరిగింది. ఇలాంటి మయంలో ఆయన ఎన్డీఏ నేతల విందు భేటీకి హాజరై తనదైన రాజకీయాన్ని ఆవిష్కరించారనే చర్చకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు.
ప్రస్తుతం జాతీయ రాజకీయ పరిణామాలు గమనిస్తే అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష ఇండియా కూటమికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఎన్డీఏ కూటమి నేతలు నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ భేటీకి హాజరుకావడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. మహిళా బిల్లు ఓడిపోయిన కారణంగా అటు బీజేపీ పెద్దలు, ఇటు కాంగ్రెస్ నేతలు తదుపరి వ్యూహంపై సమాలోచనలు చేస్తున్న సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్డీఏ ఎంపీలు, ఇతర నేతలతో సరదాగా గడపడమే హాట్ టాపిక్ అవుతోంది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. శుక్రవారం మహిళా బిల్లుపై ఓటింగ్ నిర్వహించిన కారణంగా ఆయన దేశ రాజధానిలో ఉండి విపక్షాన్ని సంఘటితం చేయడంపైనే దృష్టి పెట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించి తమ మాట నెగ్గించుకున్నామని సంబరాలు చేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన శనివారం ఉదయం ఏపీకి చెందిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఢిల్లీలో ఉన్న తెలుగు రాష్ట్రాల ఎంపీలకు కేంద్ర మంత్రి విందు ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి మంత్రులు రామ్మోహననాయుడు, కుమారస్వామి హాజరయ్యారు. అదేవిధంగా ఏపీకి చెందిన పలువురు టీడీపీ సీనియర్లు వెళ్లారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా వారిని కలిసేందుకు మంత్రి శ్రీనివాసవర్మ నివాసానికి వెళ్లారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణకు చెందిన బీజేపీ నేత లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అంతా కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. రాజకీయానికి అతీతంగా జరిగిన ఈ కార్యక్రమానికి చెందిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. విభిన్న రాజకీయ వేదికల్లో ఉన్న ముఖ్య నేతలు ఒక చోట కలుసుకోవడం, సరదాగా నవ్వుతో మాట్లాడుకోవడం అరుదైన సంఘటనగా వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం రేవంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఆయన ప్రాధాన్యత పెరగడంతో ఈ కార్యక్రమం కూడా అందరి దృష్టిని ఆకర్షించిందని చెబుతున్నారు.
