సీనియర్లకు చోటు పెట్టలేదు.. రేవంత్ వ్యూహం ఏంటి?
తన మంత్రి వర్గం విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంద ని పరిశీలకులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 9 Jun 2025 3:00 AM ISTతన మంత్రి వర్గం విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చాలానే జాగ్రత్తలు తీసుకున్నట్టు కనిపిస్తోంద ని పరిశీలకులు చెబుతున్నారు. ఆది నుంచి ఆశించిన వారికి.. ముఖ్యంగా సీనియర్లకు తన టీంలో చోటు కల్పించకపోవడం గమనార్హం. వాస్తవానికి మొదటి నుంచి కూడా కోమటి రెడ్డి వెంకట రెడ్డి సోదరుడు.. రాజగోపాల్ రెడ్డికి చోటు ఖాయమని ప్రచారం జరిగింది. అయితే.. తాజాగా ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. పైగా.. ఎస్సీలకు ప్రాధాన్యం ఇచ్చారు.
రాష్ట్రంలో కుల గణన తర్వాత.. బీసీలకు ప్రాధాన్యం ఇస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎందుకంటే. రా ష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. అంతేకాదు.. ఇదే రెడ్డి సీఎం ఆఖరు కావొచ్చని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బీసీలకు మంత్రి వర్గంలో చోటు ప్రధానంగా ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఇద్దరు ఎస్సీలకు మాత్రమే పెద్దపీట వేయడం.. అందునా.. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
ఈ పరిణామం.. సహజంగానే సీనియర్లకు.. పార్టీలో ఉన్న నాయకులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగించే విషయమే. అయినా.. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ కూర్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాంగ్రెస్‌కు కీలకమైన ఎస్సీ ఓటు బ్యాంకును కదలకుండా చేసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అయితే.. ఇదేసమయంలో బీసీల ఓటు బ్యాంకు పరిస్థితి ఏంటన్నది కూడా.. ప్రశ్న. ఇక, పార్టీకి మూల స్థంభాలుగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి తాజా కూర్పులో ప్రాధాన్యం ఇవ్వలేదు.
కానీ, ఇప్పటికే రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వంటి వారు ఉన్నారు. దీంతో మరింత మందికి అవకాశం ఇస్తే.. అది పార్టీపైనా.. ప్రభుత్వంపై విమర్శలకు అవకాశం ఇచ్చినట్టు భావించారని అనుకోవాలి. ఈ నేపథ్యంలోనే ముగ్గురికి మాత్రమే అవకాశం ఇవ్వడం ద్వారా.. ఈ విమర్శలకు చెక్ పెడుతూ.. కొత్తవారికి అవకాశం కల్పించడం ద్వారా.. రేవంత్ టీంలో యువ నేతలకు చాన్స్ దక్కిందన్న చర్చకు ప్రాధాన్యం పెంచారు. అయితే.. దీనిని సీనియర్లు ఎలా చూస్తారన్నది వేచి చూడాలి.