Begin typing your search above and press return to search.

అసెంబ్లీ టికెట్లు రానివారికే పదవులు.. రేవంత్ సంచలన నిర్ణయం

రేవంత్ పార్టీ హైకమాండ్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్‌లో పదవుల కేటాయింపు విషయంలో స్పష్టతనిచ్చారు.

By:  Tupaki Desk   |   14 March 2025 1:00 AM IST
అసెంబ్లీ టికెట్లు రానివారికే పదవులు.. రేవంత్ సంచలన నిర్ణయం
X

పదవుల పంపిణీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన తర్వాత, మిగతా పదవుల విషయంలో.. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఢిల్లీలో పార్టీ నాయకత్వంతో భేటీ కానున్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆయన ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

రేవంత్ పార్టీ హైకమాండ్‌తో తన అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, భవిష్యత్‌లో పదవుల కేటాయింపు విషయంలో స్పష్టతనిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిక్కెట్లు రానివారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసిన వారికి 37 కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించామని చెప్పారు. అదనంగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లకు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించామని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షులందరికీ కూడా పదవులు ఇచ్చామని తెలిపారు.

గాంధీ కుటుంబంతో తన అనుబంధం గురించి ప్రస్తావిస్తూ, ఫొటోలు తీసి చూపించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై తమ వైఖరిని మరోసారి స్పష్టంగా వెల్లడించారు.

కేంద్ర కేబినెట్‌లో ఉన్న నిర్మలా సీతారామన్ తమిళనాడుకు మెట్రో రైలు ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారని, అయితే తెలంగాణ అంశాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు 253 ఎకరాల భూసేకరణ పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మెట్రో, మూసీ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇస్తే సరిపోతుందని, బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

డీలిమిటేషన్ విధానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాత డీఎంకే సమావేశంలో తమ వైఖరిని ప్రకటిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ నేతలు ప్రజాసమస్యలపై చర్చించకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.