Begin typing your search above and press return to search.

హైదరాబాద్ పై వరాల జల్లు.. కేబినెట్ లో కీలక నిర్ణయాలు

తాజాగా నిర్వహించి కేబినెట్ భేటీలో హైదరాబాద్ మహానగరంపై వరాలు వర్షం కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

By:  Garuda Media   |   24 Feb 2026 1:13 PM IST
హైదరాబాద్ పై వరాల జల్లు.. కేబినెట్ లో కీలక నిర్ణయాలు
X

తాజాగా నిర్వహించి కేబినెట్ భేటీలో హైదరాబాద్ మహానగరంపై వరాలు వర్షం కురిపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ సమావేశానికి సంబంధించి దాదాపు 50కు పైగా అంశాలతో కూడిన ఎజెండాలో ఎక్కువ హైదరాబాద్ మహానగరంతో ముడిపడి ఉన్నవే. అందుకు తగ్గట్లే.. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత పలు డెవలప్ మెంట్ ప్రాజెక్టులతో పాటు.. రోడ్లు.. తాగునీటికి సంబంధించి కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఓకే చెప్పింది. తాజాగా ప్రకటించిన వరాలు దాదాపు రూ.4వేల కోట్లకు పైనే కావటం విశేషం. ఇందులో కీలకాంశాల్ని చూస్తే..

- హెచ్ ఎండీఏ పరిధిలోకి మరో నాలుగు గ్రామాల్ని (నవాబ్ పేట మండలంలోని చిట్టిగూడ, యావాపూర్, మోమిన్ పేట మండలంలోని టేకుల పల్లి, ఏక్తాలా గ్రామాలు) చేర్చేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు. నియోపోలిస్ రిజర్వాయర్ నిర్మాణానికి భూమిని కేటాయించారు. హైదరాబాద్ లోని అత్యాధుని జంతు సంరక్షణ కేంద్రానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

- సీఆర్ఎంపీ రెండో దశకు కేబినెట్ ఓకే చెప్పింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.3145 కోట్లతో 1142కి.మీ మేర ప్రధాన రహదారుల నిర్వహణ.. నాణ్యతను మెరుగుపర్చటమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. ఇందుకు ఐదేళ్ల కాలపరిమితితో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. హైదరాబాద్ మహానగరంలో రోడ్ల రిపేర్లు.. దెబ్బ తిన్న రోడ్లను పూర్తిగా తొలగించి కొత్తవి వేయటం.. కొత్తగా బీటీ.. సీసీ రోడ్లు వేయటం లాంటి పనులు చేపడతారు.

- 1965, 1981 రెండు సందర్భాల్లో నగర తాగునీటి అవసరాల కోసం మంజీరా ఫేజ్ 1, మంజీరా ఫేజ్ 2 పైపులైన్ల స్థానంలో రూ.772 కోట్లతో కొత్త పైపులైన్ వేయనున్నారు. కలాబ్ గూర్ నుంచి హైదర్ నగర్ వరకు నీటిని పంపింగ్ చేస్తారు. ప్రతి రోజు 45 ఎంజీడీల మంజీరా నీళ్లు సరఫరా అవుతున్న వేళ.. పైపులు పూర్తిగా దెబ్బ తినటంతో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. వీటిని మైల్డ్ స్టీల్ లైన్ వేయటానికి ఓకే చేశారు.

- హైదరాబాద్ తాగునీటి సరఫరాలో కీలకమైన ఉస్మాన్ సాగర్ కాలువ స్థానంలో రూ.280 కోట్లతో కొత్త పైపులైన్ వేయనున్నారు. ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ల వరకు 16కి.మీ. మేర 1920లో కాలువను నిర్మించారు. గ్రావిటీతో రోజుకు 25 ఎంజీడీల నీటిని తరలించే సామర్థ్యంతో దీన్ని ఏర్పాటు చేసినా.. రిపేర్లు.. లీకేజీల కారణంగా ప్రస్తుతం 19 ఎంజీడీల నీరే సరఫరా అవుతోంది.

- కోకాపేట నియోపొలిస్ వద్ద జలమండలి ఏర్పాటు చేయనున్న భారీ రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో శారదాపీఠానికి కేటాయించిన రెండు ఎకరాల భూమిని ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి బదులుగా శారదాపీఠానికి మరోచోట భూమిని కేటాయిస్తారు.

- హైదరాబాద్ లోని వీధి కుక్కలు.. ఇతర జంతువుల సంరక్షణ కోసం జీహెచ్ఎంసీ - రాంకీ ఫౌండేషన్ - ఆల్ ఫర్ యానిమల్స్ ఫౌండేషన్ సంయుక్తంగా గోపన్ పల్లిలో ఏర్పాటు చేసే కేంద్రానికి ఓకే చెప్పారు.

- అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలో పండ్ల మార్కెట్ కు 223 ఎకరాల కేటాయింపు. ప్రపంచ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణం చేపడతారు. సైదాబాద్ మండలం గడ్డిఅన్నారంలో టీజీవో కార్యాలయ నిర్మాణానికి 600 గజాల స్థలం కేటాయింపు.

- రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పురపాలక శాఖ, పర్యాటక శాఖ, హోంశాఖలకు కేటాయించిన భూములకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు బదలాయింపు.

- తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రాంతాలను మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఓకే చేసింది. దీంతో మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఆమోదం లభించినట్లైంది. ఆరు జోన్లు.. 30 సర్కిళ్లు.. 150 వార్డులతో నూతన జీఎంసీ, మూడు జోన్లు, 15 సర్కిళ్లు, 76 వార్డులతో సైబరాబాద్, మూడు జోన్లు, 15 సర్కిళ్లు, 74 వార్డులతో మల్కాజ్ గిరి మునిసిపల్ కార్పొరేషన్లకు మంత్రివర్గ ఆమోదం లభించినట్లైంది.