రేవంత్ ది నిజాయతీనా నిస్సహాయతా ?
నాయకుడు అంటేనే బీరువు కాకూడదు. ధైర్యంగా ఏ సమస్య అయినా ఎదుర్కొనే విధంగా ఉండాలి.
By: Tupaki Desk | 7 May 2025 4:56 AMనాయకుడు అంటేనే బీరువు కాకూడదు. ధైర్యంగా ఏ సమస్య అయినా ఎదుర్కొనే విధంగా ఉండాలి. గుండెల్లో కొండంత కష్టం పెట్టుకున్నా నవ్వుతూ కనిపించాలి. నిబ్బరం కూడా చూపించాలి. కానీ తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విషయమే తీసుకుంటే ఆయన కుండబద్దలు కొడుతున్నాను అనో లేక ఉన్నది ఉన్నట్లుగా నిజాయతీగా మాట్లాడుతున్నాను అనో భావించవచ్చు.
కానీ జనంలోకి వేరే విధంగా అది వెళ్తోంది అంతే కాదు ప్రతిపక్షాల చేతికి కోరి అస్త్రాన్ని అందించినట్లు గా ఉంది అని అంటున్నారు. ఖజానాలో డబ్బులు లేవు ఆర్థికంగా ఇబ్బందులు అని రేవంత్ రెడ్డి చెబితే జనాలు అర్ధం చేసుకుంటారా అన్నది ప్రధానమైన ప్రశ్న. అంతే కాదు ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె ఆలోచన మానుకుని వెనక్కి వస్తారా అన్నది కూడా ఆలోచించాలి.
ఖజానాలో డబ్బులు లేవు అని చెబితే ఏదో విధంగా పూడ్చుకోమంటారు ఈ రోజులలో అప్పులు చేయని రాష్ట్రమే లేదు. ఆ మాటకు వస్తే కేంద్రమే వేల కోట్లు అప్పు చేస్తోందని చెబుతారు. అటువంటిది అప్పు పుట్టడం లేదు దొంగలుగా చూస్తున్నారు అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎలా ఉంటుంది అన్నది ప్రశ్న. అంతే కాదు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకోవడం వల్ల ఇమేజ్ తగ్గుతుంది కానీ బాధను ఎవరు అర్థం చేసుకుంటారు అని కూడా అంటున్నారు.
ఏమీ లేదు ఒక సాధారణ కుటుంబంలో ఇంటి యజమాని నా దగ్గర డబ్బులు లేవు అంటే కుటుంబ సభ్యులే సహకరించని రోజులు ఇవి అలాంటిది గత కేసీఆర్ ప్రభుత్వం అన్నీ అప్పులు చేసింది. వాటి వడ్డీలు కడుతున్నాం అందువల్ల ఉన్న దాంతో సర్దుకుందాం, సంసారం వీధిన పడకూడదు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.
అయితే ఒక్కడూ ఈ మొర ఆలకించకపోగా విమర్శలు ఎక్కు పెడతారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి కౌంటర్ వచ్చింది. అప్పులు మీకు పుట్టవని ఆయన సెటైర్లు పేల్చారు. మీరు ఢిల్లీ వెళ్తే అందుకే ఎవరూ అపాయింట్మెంట్లు ఇవ్వరని కూడా ఎద్దేవా చేశారు.
ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే వారికి ఎందుకు ఖజానా సంగతి పడుతుంది అన్నది ప్రశ్న. వారికి ఎన్నో ఆశలు పెట్టి హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తరువాత కొన్ని అమలు చేశారు. మరి కొన్ని చేయలేదు. ఇపుడు చూస్తే ఖజానా లో చిల్లి గవ్వ లేదు అని సాక్ష్తాత్తూ సీఎం చెబుతున్నారు. కానీ జనాలు కనికరించి మాకు ఏ హామీ అమలు చేయవద్దు అని అంటారా. ఇది ఒట్టి భ్రమ కాకపోతోనూ అని అంటున్నారు
ఇవన్నీ చూస్తూంటే రేవంత్ రెడ్డి పదే పదే ఖజానా గురించి చెబుతూ తనను తాను తగ్గించుకుంటూ తెలంగాణా రాష్ట్ర ఇమేజ్ ని కూడా తగ్గిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఎంత చెప్పినా జరిగేదీ ఒరిగేదీ ఏమీ ఉండదు. ఇక ఉద్యోగుల విషయంలో సామరస్యంగా ఒక పరిష్కారం చూడాలి కానీ డబ్బులు లేవని చెబితే ఎవరు ఆగుతారు. ఎవరు తమ ఆందోళలను మానుకుని వెనక్కి వెళ్తారు
మరో వైపు చూస్తే రేవంత్ రెడ్డి ఇదే తీరున బేలగా డీలాపడి మాట్లాడితే అది కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చకు దారి తీసి వేరే విధమైన పరిణామాలు చోటు చేసుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మా సీఎం నిజాయతీగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు అని మంత్రి శ్రీధర్ బాబు సమర్ధించ వచ్చు కాక. ఎంతమంది ఆ విధంగా రేవంత్ రెడ్డి వెంట నిలుస్తారు అన్నదే పెద్ద ప్రశ్న.