బీఆర్ఎస్ కాదు...డీఆర్ఎస్ !
అదేంటి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది కదా మళ్ళీ డీఆర్ఎస్ అని ఈ కొత్త పేరు ఏమిటి అన్న చర్చ అయితే తెలంగాణా రాజకీయ అభిమానులలో కలగవచ్చు.
By: Tupaki Desk | 7 Jun 2025 9:26 AM ISTఅదేంటి టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారింది కదా మళ్ళీ డీఆర్ఎస్ అని ఈ కొత్త పేరు ఏమిటి అన్న చర్చ అయితే తెలంగాణా రాజకీయ అభిమానులలో కలగవచ్చు. కానీ ఈ కొత్త పేరుని పెట్టింది గులాబీ బాసులు కానే కారు. వారికి రాజకీయంగా ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ ని కాస్తా డీఆర్ఎస్ అనేసారు.
ఆ పేరు ఫుల్ ఫార్మ్ లో ఆయనే చెప్పారు. దెయ్యాల రాజ్య సమితి అని దాని అసలు పేరుట. దెయ్యాలు మధ్యలో ఎక్కడ నుంచి వచ్చాయంటే ఎక్కడో ఏమిటి కేసీఆర్ సొంత బిడ్డ కవిత చెప్పిందిగా అని రేవంత్ రెడ్డి భలే లాజిక్ పాయింట్ తీశారు ఈ మధ్యనే కవిత కేసీఆర్ దేవుడని ఆయన చుట్టూ దెయ్యాలు చాలా చేరాయని అవన్నీ కోటరీగా ఏర్పాటు అయ్యాయని ఘాటు విమర్శలు చేశారు.
దాంతో ఏకంగా కవిత మాటలనే పట్టుకుని గులాబీ కోటకే వాటిని గట్టిగా తిప్పి బలంగా ప్రయోగించారు అన్న మాట. దెయ్యాల రాజ్య సమితి అంటూ రేవంత్ రెడ్డి పెట్టిన ఈ కొత్త పేరు అయితే వైరల్ అవుతోంది. బీఅర్ఎస్ ని ఇక మీదట ఆయన అలాగే సంభోదించినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
తనకు జీవిత కాలంలో లక్ష్యాలు అంటూ ఏవీ లేవని అవన్నీ నెరవేర్చుకున్నాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తనను అన్యాయంగా జైలుకు పంపిన కేసీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని అనుకున్నానని అది సాధ్యపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అలా కేసీఅర్ కుర్చీలో కూర్చుని తన జీవిత కాలం లక్ష్యం నెరవేర్చుకున్నానని ఆలేరు సభలో రేవంత్ రెడ్డి చెప్పారు.
ఇక తెలంగాణా రాష్ట్ర అభివృద్ధి తన ధ్యేయమని అన్నారు. ఎవరు అడ్డుపడినా అభివృద్ధి చేసి తీరుతామని ఆయన స్పష్టంగా చెప్పారు. అపరిశుభ్రంగా ఉన్న మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో అడ్డుకుంటున్న వారి అభివృద్ధి నిరోధకులు అని ఆయన ఆగ్రహించారు.
తాను అభివృద్ధి బాటన నడుస్తూంటే బీఆర్ఎస్ నేతలు లేని పోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పదేళ్ళ పాటు సీఎం గా ఉన్న కేసీఆర్ ఏనాడైనా ప్రతీ నెలా ఒకటవ తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇచ్చారా అని రేవంత్ ప్రశ్నించారు. బంగారు తెలంగాణాను ఎనిమిది లక్షల కోట్ల మేర అప్పుల పాలు చేసారు అని ఆయన ఆరోపించారు.
అభివృద్ధిని మరచి పదేళ్ళ పాటు బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. దెయ్యాల రాజ్య సమితికి దెయ్యాల అధినేత ఉన్నారని ఆయన ఫాం హౌస్ లో పడుక్కుంటునారని కేసీఅర్ మీద పరోక్ష విమర్శలు చేశారు. ఈ దె య్యాలను తెలంగాణా నుంచి తరిమికొట్టే బాధ్యతను తాను తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి చెప్పడం విశేషం.
