Begin typing your search above and press return to search.

భద్రాద్రి రాముడిపై ఆన.. 117 సీట్లు గెలుస్తాం.. సీఎం రేవంత్ రెడ్డిలో అంత కాన్ఫిడెంట్ ఏంటి?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ 'హిందూ వ్యతిరేక' ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.

By:  A.N.Kumar   |   11 July 2026 12:00 AM IST
భద్రాద్రి రాముడిపై ఆన.. 117 సీట్లు గెలుస్తాం..  సీఎం రేవంత్ రెడ్డిలో అంత కాన్ఫిడెంట్ ఏంటి?
X

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ వేడివేడి చర్చలతో సవాల్-ప్రతిసవాల్‌తో అట్టుడుకుతూనే ఉంటాయి. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా జగన్నాధపురంలో నిర్వహించిన 'రైతు భరోసా ఆశీర్వాద సభ'లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ఫలితాలపై నేతలు ధీమా వ్యక్తం చేయడం సహజమే అయినప్పటికీ రేవంత్ రెడ్డి ఏకంగా భద్రాద్రి రాముడిపై ఆనబెట్టి 2029 ఎన్నికల్లో 117 స్థానాలు గెలుస్తామని సవాల్ విసరడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబానికి బహిరంగ సవాల్ విసురుతూ రేవంత్ రెడ్డి చూపించిన ఈ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న అసలు వ్యూహాలు ఏంటి? అన్నది ఆసక్తి రేపుతోంది.

నియోజకవర్గాల పునర్విభజన లెక్కలు

రేవంత్ రెడ్డి కేవలం గెలుపుపై ధీమా మాత్రమే ప్రకటించలేదు, భవిష్యత్తు రాజకీయ ముఖచిత్రాన్ని కూడా ప్రస్తావించారు. 2029 మే-జూన్ నాటికి తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 119 నుంచి 182కు, అలాగే లోక్‌సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. మారుతున్న ఈ సమీకరణల్లో కూడా కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీతో 117 స్థానాలు అధికారంలోకి వస్తుందని చెప్పడం ద్వారా పార్టీ శ్రేణుల్లో ముందే భారీ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. "కేసీఆర్ కాచుకో.. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ.. ఎవరైనా రండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ కుటుంబ మార్క్ రాజకీయాలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఉన్నాయి.

'భద్రాద్రి రాముడి' సెంటిమెంట్

రేవంత్ రెడ్డి మొదటి నుంచీ భద్రాద్రి శ్రీరాముడిపై తన భక్తిని చాటుకుంటూనే ఉన్నారు. సీఎం అయిన తర్వాత కూడా సతీసమేతంగా భద్రాచలం వెళ్లి పట్టువస్త్రాలు సమర్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రికి ఇచ్చిన ప్రాధాన్యత భద్రాచలానికి ఇవ్వలేదనే అసంతృప్తి ఖమ్మం ప్రజల్లో ఉందనేది కాంగ్రెస్ వాదన. అందుకే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ స్థానిక సెంటిమెంట్‌ను కాంగ్రెస్ తన వైపు తిప్పుకుంటోంది. ఖమ్మం సభలో రాముడి పేరుతో ప్రమాణం చేయడం వెనుక ఖమ్మం జిల్లా ఓటర్లతో ఉన్న బలమైన బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనే వ్యూహం కనిపిస్తోంది.

సాఫ్ట్ హిందుత్వ వ్యూహం?

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ 'హిందూ వ్యతిరేక' ముద్ర వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయోధ్య, రామసేతు వంటి అంశాలను ఇందుకు వాడుకుంటాయి. అయితే రేవంత్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలతో ఉన్న పాత పరిచయాలు, ఆయన రాజకీయ శైలి దీనికి భిన్నంగా ఉంటాయి. తెలంగాణలో బీజేపీ పుంజుకోకుండా ఉండాలన్నా హిందూ ఓటు బ్యాంకు చేజారకుండా ఉండాలన్నా ఇటువంటి 'సాఫ్ట్ హిందుత్వ' లైన్ అవసరమని రేవంత్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భద్రాద్రి రాముడిపై ఆన పెట్టడం ద్వారా అటు సెంటిమెంట్‌ను, ఇటు రాజకీయ ప్రత్యర్థులను ఒకే దెబ్బకు కట్టడి చేసే వ్యూహం ఇందులో దాగుంది.

నిధుల విడుదల, రైతు సంక్షేమ పథకాల అమలుతో పాటు ఇలాంటి సెంటిమెంట్ సవాళ్లు రేవంత్ రెడ్డి మార్క్ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. మరి రేవంత్ విసిరిన ఈ 'భద్రాద్రి రాముడి ఆన' సవాల్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఎలా బదులిస్తాయో 2029 నాటికి తెలంగాణ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.