Begin typing your search above and press return to search.

ఇగోలు పక్కనపెట్టి రేవంత్ రెడ్డి నిజాయితీతో ఓ విన్నపం

ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన న్యాయవేత్త జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని నిలపడం తెలుగు ప్రజలకు గొప్ప గౌరవంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

By:  A.N.Kumar   |   20 Aug 2025 9:36 AM IST
ఇగోలు పక్కనపెట్టి రేవంత్ రెడ్డి నిజాయితీతో ఓ విన్నపం
X

ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చ సాగుతోంది. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన న్యాయవేత్త జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని నిలపడం తెలుగు ప్రజలకు గొప్ప గౌరవంగా నిలిచిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల 42 మంది లోక్‌సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు ఏకమై సుదర్శన్‌రెడ్డి గెలుపుకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీలు, రాజకీయాలకతీతంగా ఇది తెలుగువారి గౌరవానికి సంబంధించిన విషయం అని సీఎం పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగురాష్ట్రాల ప్రధాన నేతలైన చంద్రబాబు నాయుడు, కేటీఆర్/కేసీఆర్, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి మద్దతు ఇవ్వడం దేశానికి మేలని తెలిపారు. ఈ క్రమంలో జస్టిస్‌ సుదర్శన్ రెడ్డి వంటి నిష్పాక్షిక వ్యక్తి ఆ పదవిలో ఉండటం అత్యవసరమని చెప్పారు. ఆయన తెలుగువారి ప్రతినిధిగా మంచి గుర్తింపు, పేరు ప్రతిష్ట కలిగిన వ్యక్తి అని గుర్తుచేశారు.

- ప్రజాస్వామ్య రక్షణలో ఇండియా కూటమి

రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ “ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీయే, మరోవైపు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఇండియా కూటమి మధ్య పోరాటం జరుగుతోంది. న్యాయకోవిదుడైన సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతిగా వస్తే రాజ్యాంగాన్ని కాపాడటమే కాకుండా బలహీన వర్గాల హక్కులు కాపాడబడతాయి” అన్నారు. రాధాకృష్ణన్‌ను ఎన్డీయే అభ్యర్థిగా పెట్టడమే బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికేనని ఆరోపించారు. “జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా పనిచేశారు. ఆయన సూచనలతోనే తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదించింది. కాబట్టి ఆయన విజయం బలహీన వర్గాల విజయం” అని తెలిపారు.

- తెలుగు ఐక్యతకు చారిత్రక పాఠాలు

తెలుగువారంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తూ రేవంత్‌రెడ్డి పీవీ నరసింహారావు ఉదాహరణను ప్రస్తావించారు. 1991లో పీవీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలిచినప్పుడు, రాజకీయ విభేదాలు ఉన్నా, ఎన్టీఆర్ ఆయనకు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. అదే విధంగా ఇప్పుడు కూడా తెలుగు నేతలందరూ సుదర్శన్‌రెడ్డి విజయానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.

- కేసీఆర్, జగన్, చంద్రబాబు, పవన్, ఒవైసీ, భాజపా ఎంపీలకు విజ్ఞప్తి

తెదేపా, వైకాపా, బీఆర్ఎస్, ఎంఐఎం, జనసేన, భాజపా నేతలు అందరూ కలసి సుదర్శన్‌రెడ్డి విజయానికి అండగా నిలవాలని రేవంత్‌రెడ్డి కోరారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌ను కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

- రాజ్యాంగాన్ని కాపాడే పోరు

ఈ ఎన్నిక ఉత్తరాది–దక్షిణాది పోరాటం కాదని, రాజ్యాంగాన్ని రక్షించేవారు.. రాజ్యాంగాన్ని కుదించే వారిమధ్య జరిగే పోరాటమని రేవంత్‌రెడ్డి అన్నారు. “ఎన్డీయే అభ్యర్థి గెలిస్తే రాజ్యాంగ మార్పులు, రిజర్వేషన్ల రద్దు అనివార్యం అవుతుంది. అందుకే తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం సుదర్శన్‌రెడ్డికి మద్దతివ్వాలి” అని విజ్ఞప్తి చేశారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక కేవలం ఒక పదవికి సంబంధించిన పోరు కాదు. ఇది రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణ, బలహీన వర్గాల హక్కుల సాధన కోసం జరిగే కీలక సమరం. తెలుగువారంతా ఏకమై జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తే, దేశ రాజకీయాల్లో తెలుగు గౌరవం మరింత పెరుగుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రేవంత్ ఆకాంక్షను సులభం చేయవు. ఇప్పటికే చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మద్దతు ఇస్తారని స్పష్టమైంది. అదే విధంగా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థినే మద్దతు ఇస్తుందని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఏ వైపు మొగ్గు చూపుతుందనే ఆసక్తి నెలకొంది. NDA పట్ల వారికి వ్యతిరేకత ఉన్నప్పటికీ, స్పష్టమైన నిర్ణయం ఇంకా వెలువడలేదు.

ఇలా చూస్తే, రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి భావోద్వేగపూర్వకమైనది, నిజాయితీతో కూడినది. కానీ రాజకీయంగా, ప్రాయోగికంగా ఆయన అభ్యర్థన నెరవేరే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ, తెలుగువారి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గెలవాలని కోరడం రేవంత్ చేసిన నిజమైన ప్రయత్నంగా నిలిచిపోతుంది.