సొంత నేతలపై సీఎం రేవంత్ గుస్సా
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. పార్టీ నేతల తీరు ఒంటెద్దుపోకడతో ఉన్నప్పటికి చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ.. అందరిని కలుపుకుపోవటమే లక్ష్యంగా వ్యవహరించేవారు సీఎం రేవంత్.
By: Garuda Media | 8 July 2026 1:43 PM ISTరెండున్నరేళ్లుగా సర్దుకుపోతూ.. ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో నెట్టుకు వస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కోపమొచ్చింది. ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతుంటే.. వాటికి సరైన సమాధానాలు ఇవ్వాల్సిన కాంగ్రెస్ నేతలు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండిపోవటం.. తగిన రీతిలో స్పందించకపోవటంపై సీఎం రేవంత్ ఆగ్రహాన్నివ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇంతమంది ఉన్నా.. ప్రభుత్వ నిర్ణయాలను పొగుడుతూ మాట్లాడని తీరుపై కోపగించుకున్న వైనం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సమయంలో.. పార్టీ నేతల తీరు ఒంటెద్దుపోకడతో ఉన్నప్పటికి చూసిచూడనట్లుగా వ్యవహరిస్తూ.. అందరిని కలుపుకుపోవటమే లక్ష్యంగా వ్యవహరించేవారు సీఎం రేవంత్. రోజులు గడుస్తున్నకొద్దీ.. అధికార ఫలాలు అందుకోవటానికి చూపించే ఉత్సాహం.. ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇచ్చే విషయంలోనూ.. ప్రభుత్వం సాధించిన విజయాలను చెప్పుకునే విషయంలో సొంతపార్టీ నేతలు వ్యవహరిస్తున్నతీరు ఆయనకు చికాకు పెంచుతున్న పరిస్థితి.
ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వేళ.. అందరిని కలుపుకుపోవటం.. మిగిలిన వారు చేస్తున్న తప్పుల్ని కవర్ చేస్తూ.. అన్నీ తానై అన్నట్లుగా నడిపించిన రేవంత్ కు.. మంత్రులు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీల తీరు అంతకంతకూ తీసికట్టుగా.. ప్రభుత్వంతో తమకు సంబంధం లేదన్నట్లుగా.. తమ పని తాము చేసుకుంటే సరిపోతుందన్న మైండ్ సెట్ ఎక్కువ అవుతున్న తీరుకు చెక్ చెప్పాలన్నట్లుగా రేవంత్ తాజా వ్యాఖ్యలు ఉన్నట్లు చెప్పాలి.
ఓవైపు ప్రభుత్వ విధానాల్ని తప్పు పడుతూ.. ఏ చిన్న అంశం వచ్చినా.. విపక్ష నేతలు పలువురు విరుచుకుపడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వెనుకాడని వేళలోనూ.. మంత్రులు.. ఇతర ప్రజాప్రతినిధుల నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న తీరు సీఎం రేవంత్ కు చికాకు తెప్పిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి విరుగుడుగా బహిరంగంగా తన రియాక్షన్ తో పార్టీలోని కొందరైనా దారికి వస్తారన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ బహిరంగ అసంత్రప్తి ఎంతమేర ఫలిస్తుందో చూడాలి.
