Begin typing your search above and press return to search.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. బీఆర్ఎస్, బీజేపీని ఇరకాటంలో పెట్టిన రేవంత్..

అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలనూ ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి.

By:  Tupaki Political Desk   |   30 March 2026 4:00 PM IST
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు.. బీఆర్ఎస్, బీజేపీని ఇరకాటంలో పెట్టిన రేవంత్..
X

తెలంగాణ రాజకీయాల్లో ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు ఇప్పుడు సెంట్రల్ పాయింట్‌గానే ఉంటుంది. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ రెండు పార్టీలనూ ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయి. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూనే, విచారణలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించడం ఇప్పుడు కొత్త రాజకీయ చర్చకు తెరలేపింది. కేసీఆర్, హరీష్‌రావును జైలులో పెట్టాకే మాట్లాడాలంటూ రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఈ ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న వివాదాలను మరోసారి రాజుకునేలా చేసింది.

పీసీ ఘోష్ నివేదిక..

కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, ఆర్థిక అవకతవకలపై నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించింది. ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరుతో ప్రజల సొమ్మును కొందరు నేతలు దండుకున్నారని నివేదిక స్పష్టం చేసిందని సీఎం పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం వంటి బ్యారేజీల నిర్మాణం, నిర్వహణలో జరిగిన లోపాలపై నివేదిక కీలక ఆధారాలను బయటపెట్టిందని రేవంత్ స్పష్టం చేశారు.

కేసీఆర్ కనుసన్నల్లోనే

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం లేకుండా ఏదీ జరగలేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కుండ బద్దలు కొట్టారు. ప్రాజెక్టు రూపకల్పన నుంచి ఇంజినీర్లకు ఆదేశాలు ఇవ్వడం వరకు అన్నీ కేసీఆర్ ఆదేశాల మేరకే జరిగాయని సీఎం ఆరోపించారు. కేవలం అధికారులను బలిపశువులను చేసి, అసలైన సూత్రధారులు తప్పించుకోవడం కుదరదని, అప్పటి జలవనరుల మంత్రి హరీష్‌రావు కూడా దీనికి సమాన బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్కు

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూనే, కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. నెలలు గడుస్తున్నా సీబీఐ విచారణ ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. ఇది బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఉన్న రహస్య ఒప్పందానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్, హరీష్‌రావును జైలులో పెట్టిన తర్వాతే బీజేపీ నేతలు నీతులు మాట్లాడాలని ఘాటుగా స్పందించారు.

ఈ వివాదంలో తన నిజాయితీని నిరూపించుకోవడానికి సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ కాళేశ్వరం అవినీతిలో తన పాత్ర కానీ, తన కుటుంబ సభ్యుల పాత్ర కానీ ఉందని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రజల సొమ్ము దోచుకున్న వారు ఎవరైనా సరే, వారు ముఖ్యమంత్రి అయినా, మాజీ మంత్రులైనా చట్టానికి లోబడి శిక్ష అనుభవించాల్సిందేనని తేల్చి చెప్పారు.

అసెంబ్లీలో వాడీవేడి చర్చ!

మున్సిపల్ ఎన్నికల ముందు ఈ కాళేశ్వరం చర్చ రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అవినీతిని అస్త్రంగా చేసుకుని బీఆర్ఎస్ పరువు తీయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని వారు మండిపడుతున్నారు. అటు బీఆర్ఎస్ ను సమర్థించలేక, ఇటు కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు సతమతమవుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతులకు వరప్రసాదం కావాల్సింది పోయి, రాజకీయాలు చేసుకునేందుకు క్షేత్రంగా మారింది. లక్షల కోట్ల అవినీతి జరిగి ఉంటే.., బాధ్యులు ఎవరో తేల్చి వారికి శిక్ష పడే వరకు ప్రజలకు న్యాయం జరగదు. కేవలం అసెంబ్లీలో మాటల యుద్ధానికి పరిమితం కాకుండా, విచారణ వేగవంతం చేసి వాస్తవాలను బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ‘జైలు’ వ్యాఖ్యల నేపథ్యంలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.