ఎపుడు కుర్చీ దిగుతానో పక్కాగా చెప్పిన రేవంత్...బీఆర్ఎస్ కి బిగ్ షాకేనా ?
మాటకారిగా కేసీఆర్ కి సరిజోడు. వ్యూహాలలోనూ ధీటైన వారు. వయసులో చూస్తే యువకుడి కిందనే లెక్క.
By: Tupaki Desk | 19 July 2025 9:20 AM ISTతెలంగాణా కాంగ్రెస్ కుర్చీ మీద ఉన్నది సామాన్యుడు అయితే కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కనీసం మంత్రి పదవి కూడా చేయకుండా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అనే మహాసముద్రంలో ఈది మరీ వీరుడు అనిపించిన వారు. ఎందరో ఉండగా తానే అధినాయకత్వానికి నచ్చి సీఎం పీఠం దక్కించుకున్నవాడు. ఆయనే రేవంత్ రెడ్డి. ఆయనతో వ్యవహారం తమాషా కాదు.
మాటకారిగా కేసీఆర్ కి సరిజోడు. వ్యూహాలలోనూ ధీటైన వారు. వయసులో చూస్తే యువకుడి కిందనే లెక్క. కేసీఆర్ కంటే చిన్న వయసులోనే పీఠాన్ని పట్టిన ఘనత ఆయనకు సొంతం. ఇక కాంగ్రెస్ పార్టీలో చూస్తే చాలా మంది సీనియర్లు ఉన్నారు. అయితే జనాకర్షణలో రేవంత్ రెడ్డి అగ్ర స్థానంలో ఉన్నారు. జనాలను తన ప్రసంగాలతో రంజింపచేయాలి అన్నా బీఆర్ఎస్ ని అధికారానికి ఆమడ దూరంలో ఉంచాలన్నా కాంగ్రెస్ వైపు అంతా చూసేలా చేయాలీ అన్నా రేవంత్ రెడ్డి మాత్రమే చేయగలరు అన్నది హైకమాండ్ కి భరోసా ఇచ్చిన వారు.
అందుకే ఆయన చాలా నిబ్బరంగా చెబుతున్నారు. తాను ఇపుడున్న ఏణ్ణర్థం కాదు, ఏకంగా 10 ఏళ్ళ పాటు తానే తెలంగాణాకు సీఎం. ఇది ఏ జ్యోతీష్కుడూ చెప్పినది కాదు, తన నిబ్బరం పట్టుదల తన వ్యూహాలు రాజకీయ చతురతతో చెబుతున్న విషయం. తెలంగాణా సీఎం కుర్చీని ఇప్పట్లో వీడేది లేదు 2034 దాకా నేనే సీఎం. ఇది పక్కాగా రాసిపెట్టుకోండి అని బీఆర్ఎస్ నేతలకే షాకిచ్చేలా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు.
ఈ విషయం కేసీఅర్ నీ డెయిరీలో కాదు నీ కొడుకు కేటీఆర్ గుండె మీద రాయి అని కూడా రేవంత్ రెడ్డి రెట్టిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ పాటు అధికారంలో ఉంటుందని కూడా రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణాలో అధికారంలో ఉన్న పార్టీల ట్రాక్ రికార్డుని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 1995 నుంచి 2004 వరకూ చంద్రబాబు అలాగే 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్, ఇక 2014 నుంది 2023 దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు
అలాగే కాంగ్రెస్ 2034 వరకూ ఉంటుంది. ఇదే నా మాట అని రేవంత్ రెడ్డి అంటున్నారు. పదేళ్ళ కాలం అధికారం ఇస్తే కేసీఆర్ తెలంగాణాకు చేసింది ఏమీ లేదని దుయ్యబెట్టారు. క్రిష్ణా గోదావరి జలాలను ఏపీకి ఎవరు దోచిపెట్టారో చర్చకు తాము సిద్ధమని ఫాం హౌస్ వదిలేసి కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఆయన సవాల్ చేశారు అన్ని వర్గాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే బీఆర్ఎస్ ఓటమి చెందిందని అన్నారు.
కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధికి ఇది ఆరంభం మాత్రమే అని మరో పదేళ్ళ పాటు ఈ ప్రగతిని చూసి కేసీఆర్ ఫాం హౌస్ లోనే అలా ఉండాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. దయచేసి నన్ను అడ్డుకోవద్దు మీరు అడ్డుకున్న ప్రతీ సారి బంతిలా నేను పైకి లేస్తాను అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ఏణ్ణర్ధం అధికార వియోగానికే తట్టుకోలేకపోతే పదేళ్ళ పాటు ఎలా ఉండగలరని సెటైర్లు పేల్చారు హామీలన్నీ వరసబెట్టి అమలు చేస్తున్నామని అలాగే అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని ప్రజలు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ నే ఆదరిస్తారు అని రేవంత్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
