ఢిల్లీ టార్గెట్.. పదేళ్ల ప్లాన్! సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్
పదేళ్ల పాటు తెలంగాణకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 16 May 2026 12:12 AM ISTతెలంగాణ ముఖ్యమంత్రిగా 2034 వరకు తానే కొనసాగుతానని, 2034 తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్లిపోతానని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు తాను సీఎంగా కొనసాగతానని ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, 2034 తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించి తర్వాత తరానికి చాన్స్ ఇస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఓ షార్ట్ న్యూస్ యాప్ నిర్వహించిన కాన్ క్లేవ్ లో టీ.సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయాలు, ఆర్థిక ప్రగతి, తెలంగాణపై తన ప్రణాళికను పంచుకున్నారు. అదే సమయంలో తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్న సంబంధాలపైనా రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పదేళ్ల పాటు తెలంగాణకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారుతోందని అంటున్నారు. ఓ కాంగ్రెస్ నేత ఇలా ప్రకటించుకోవడం పెద్ద సాహసంగానే వ్యాఖ్యానిస్తున్నారు. 2023లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని అంటున్నారు. పార్టీలో సీనియర్లు సైతం సీఎం నాయకత్వానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు వస్తుండటంతో సీఎం తన భవిష్యత్తు రాజకీయంపై ధీమాగా ఉన్నారని అంటున్నారు.
ఇక తాను రాజకీయాల్లో ఏం అవ్వాలని అనుకుంటానో, అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ అవుతానని అనుకున్నానని అయ్యానని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అవ్వాలని భావించి ఆ పదవులు చేపట్టానని వివరించారు. 2014లో ఎంపీ అవ్వాలని అనుకున్నా కుదరలేదని, కానీ, 2019లో పార్లమెంటు సభ్యుడిగా పనిచేసే అవకాశం వచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే తాను ముఖ్యమంత్రి అవుతానని అప్పుడే చెప్పానని, అదే జరిగిందని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీయేనని సీఎం స్పష్టం చేశారు. ఇండియా కూటమిని సైతం రాహుల్ గాంధీ అభ్యర్థిత్వంపై ఒప్పిస్తామని తెలిపారు. ప్రధాని పదవిపై రాహుల్ గాంధీకి ఆసక్తి లేదని, కానీ వికారాబాద్ సభలో తానే ఆయనను పీఎం అభ్యర్థిగా ఒప్పించానని రేవంత్ రెడ్డి వివరించారు. ఇదే సమయంలో తన రాజకీయ గురువు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానంటే చంద్రబాబు ఎంతో గౌరవిస్తారని, పార్టీ మారినంత మాత్రాన విమర్శలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరే విషయాన్ని విజయవాడ వెళ్లి చంద్రబాబుకు చెప్పానని, ఆయన అంగీకరించారని వెల్లడించారు.
