Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు ఇరిగేషన్ శాఖ అధికారులు టచ్ లో ఉన్నారా?

కేసీఆర్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పులపై రేవంత్ సర్కారు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Jun 2025 7:00 PM IST
బీఆర్ఎస్ కు ఇరిగేషన్  శాఖ అధికారులు టచ్ లో ఉన్నారా?
X

కేసీఆర్ సర్కారు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్పులపై రేవంత్ సర్కారు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ శాఖకు చెందిన కొందరు అధికారులు బీఆర్ఎస్ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపైనా బీఆర్ఎస్ ముఖ్యనేతలకు సమాచారం వెను వెంటనే తెలిసిపోవటమే దీనికి కారణం.

ఈ నేపథ్యంలో నీటిపారుల శాఖలో జరుగుతున్న పరిణామాలపై రేవంత్ సర్కారు ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడులు కూడా ఇందులో భాగంగా జరిగి ఉంటాయన్న ప్రచారం బలంగా సాగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించటం.. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పని చేసిన వారిపైనే ఎక్కువగా ఫోకస చేసినట్లుగా తెలుస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవకతవకలు జరిగినట్లుగా భావిస్తున్నారు. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అనుమానించినట్లే ఇటీవల కాలంలో పట్టుబడుతున్న ఇంజనీర్లు వందల కోట్లకు పైగా ఆక్రమ ఆస్తులే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగునీటి రంగానికి పెద్ద పీట వేయటం.. ఇందులో భాగంగా కొందరు ఇంజినీర్లకు బీఆర్ఎస్ ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్లుగా భావిస్తున్నారు.

ఈ అనుమానాన్ని బలపర్చేలా నిఘా వర్గాల నివేదిక సమాచారం ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన పలు ఫైళ్ల కాపీలు.. ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లటంపై శాఖలోని కీలక నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ తీరుపై రేవంత్ సర్కారు సీరియస్ గా ఉండటమే కాదు.. ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతున్న వారికి చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాలన్న ఆదేశాల్ని ప్రభుత్వం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వాలు మారతాయి. అధికారులు మారరు. ఈ విషయాన్ని అధికారులు ఎందుకు మిస్ అవుతున్నట్లు? అన్నది అసలు ప్రశ్న.