Begin typing your search above and press return to search.

ఆ విషయంలో ఏపీని ఫాలో చేస్తున్న తెలంగాణ!

పాలనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీ.సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Desk   |   9 April 2025 7:00 PM IST
ఆ విషయంలో ఏపీని ఫాలో చేస్తున్న తెలంగాణ!
X

పాలనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టీ.సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అభివృద్ధిపై ఒకరితో ఒకరు పోటీపడుతున్న ఈ ఇద్దరు నేతలు పరిపాలనలో ఒకరిని ఇంకొకరు ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. దీనికి ఉదాహరణగా తెలంగాణలో అమలు చేస్తున్న స్లాట్ బుకింగు విధానాన్ని చూపుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ఏపీలో ప్రారంభించిన ఈ విధానాన్ని తెలంగాణలో కూడా ఆగమేఘాలపై ప్రవేశపెట్టడంతో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రిజిస్ట్రేషన్ల శాఖలో దళారీ వ్యవస్థను నివారించడంతోపాటు అవినీతికి చెక్ చెప్పడం, సమయాన్ని ఆదా చేయడమనే లక్షాలతో స్లాట్ బుకింగు విధానాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఏపీలో గత శుక్రవారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తేగా, తెలంగాణలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో ఇకపై కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని చెబుతున్నారు. ఏపీలో ప్రస్తుతం అమలు అవుతున్న ఈ విధానంతో సమయం ఆదా అవుతోందని వినియోగదారులు చెబుతున్నారు. ఇంటివద్ద నుంచి ఆన్ లైనులో స్లాట్ బుక్ చేసుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ సమయానికి కార్యాలయం వద్దకు వెళుతూ పది నిమిషాల్లోనే తమ పని ముగించుకుని వెనుదిరుగుతున్నారు. దీనివల్ల సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. మరోవైపు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతోందని అంటున్నారు.

ఏపీలో సక్సెస్ అయిన స్లాట్ బుకింగ్ విధానాన్ని తెలంగాణలో అమలుచేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో తొలుత క్రిష్ణా జిల్లా కంకిపాడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించారు. కాగా, తెలంగాణలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే ముందుగా 22 చోట్ల ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ 22 చోట్ల ఎదురయ్యే సమస్యలను గుర్తించి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎక్కువ డాక్యుమెంట్లను రిజిస్ట్రేసన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని నివారించడానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రోజువారి పనివేళలను 48 స్లాటులుగా విభజించారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా తమకు నచ్చిన సమయంలో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేయించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. అదేసమయంలో స్లాట్ బుకింగు చేసుకోని వారి కోసం ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు సమయాన్ని కేటాయించనున్నారు.