Begin typing your search above and press return to search.

రిటర్నింగ్ అదికారులపై ఇన్ని ఫిర్యాదులా ?

ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన నామినేషన్ల దాఖలు అయిపోయింది. ఇక మిగిలింది ఉపసంహరణలు మాత్రమే. దీనికి బుధవారంతో గడువు ముగిసిపోయింది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 9:43 AM GMT
రిటర్నింగ్ అదికారులపై ఇన్ని ఫిర్యాదులా ?
X

ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన నామినేషన్ల దాఖలు అయిపోయింది. ఇక మిగిలింది ఉపసంహరణలు మాత్రమే. దీనికి బుధవారంతో గడువు ముగిసిపోయింది. ఇక్కడే పెద్ద ట్విస్టు చోటుచేసుకున్నది. అదేమిటంటే కాంగ్రెస్, బీజేపీల అభ్యర్ధులతో పాటు స్వతంత్ర అభ్యర్ధులు ఏకంగా చాలామంది రిటర్నింగ్ అధికారులపైన కేంద్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. వీళ్ళ ఫిర్యాదు ఏమిటంటే నామినేషన్ల దాఖలులో బీఆర్ఎస్ అభ్యర్ధులు తప్పులుచేసినా రిటర్నింగ్ అధికారులు ఓకే చేశారని.

అంటే చాలామంది రిటర్నింగ్ అధికారులు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల్లోనే చెబుతున్నారు. తమకు గనుక న్యాయం జరగకపోతే కోర్టులను ఆశ్రయించక తప్పదని కూడా ప్రత్యర్ధులు తమ ఫిర్యాదుల్లో హెచ్చరికల్లాంటి సమాచారాన్ని అందిస్తున్నారు. దీంతో తమకు అందిన ప్రతి ఫిర్యాదును ఎన్నికల కమీషనర్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఫిర్యాదులో వాస్తవం ఉందని అనుకుంటే వెంటనే అదే విషయాన్ని రిటర్నింగ్ అధికారులకు పంపించి వివరణ కోరుతున్నారు.

గడచిన ఐదురోజుల్లో 651 ఫిర్యాదులు అందాయంటేనే విషయం ఎంత సీరియస్ గా ఉందో అర్ధమవుతోంది. అధికారపార్టీ అభ్యర్ధుల నామినేషన్లలో తప్పులున్నా పట్టించుకోకుండా ప్రతిపక్షాల్లోని కొందరి నామినేషన్లతో పాటు స్వతంత్ర అభ్యర్ధుల్లోని చాలామంది నామినేషన్లను డైరెక్టుగా తిరస్కరించినట్లు ఫిర్యాదుల్లో చెబుతున్నారు. నామినేషన్ల ఫారాల్లో తప్పులను సరిచేయించే అవకాశం ఉన్నా రిటర్నింగ్ అదికారులు నేరుగా తిరస్కరించేస్తున్నారని చాలామంది ఫిర్యాదులు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్ధులు మల్లారెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, పువ్వాడ అజయ్ కుమార్, విజయుడు, మాగంటి గోపీనాధ్, కృష్ణమోహన్ రెడ్డి లాంటి మరికొందరు అభ్యర్ధులు నామినేషన్లలో తప్పుడు వివరాలు ఇచ్చినా లేదా పూర్తి వివరాలు ఇవ్వకపోయినా రిటర్నింగ్ అధికారులు పట్టించుకోలేదని ఉదాహరణలుగా చూపించారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి పెద్దఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయని చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఆఫీసు అధికారికంగా ప్రకటించింది. 402 ఫిర్యాదులను పరిష్కరించామని, మరో 107 ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నట్లు చెప్పింది. మరో 139 ఫిర్యాదులపై చర్యలు వివిధ దశల్లో ఉన్నాయని కూడా వివరించింది. అంటే అధికారిక ప్రకటన ప్రకారమే ఎన్ని వందల ఫిర్యాదులు వస్తున్నాయో అర్ధమవుతోంది.