రేవంత్ పొలిటికల్ రిటైర్మెంట్ వయసు 70...
యాభై ఏళ్లు దాటినవారు కూడా రాజకీయాల్లో యువ నాయకులుగా చెలామని అవుతుంటే.. అసలు రిటైర్మెంట్ అనే పదానికి అర్ధం ఉందా? అని మనం సర్దిచెప్పుకోవాల్సి ఉంటుంది.
By: Tupaki Desk | 18 Aug 2025 9:31 AM ISTరాజకీయాల్లో రిటైర్మెంట్ వయసు ఎంత..? ఫలానా వయసుకే వైదొలగాలని ఏమైనా ప్రామాణికత ఉందా....! క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే బీజేపీలోనే 70 ఏళ్లు దాటినవారు రిటైర్ కావాలనే అప్రకటిత నిబంధన అమలు కావడం లేదు. మరి మిగతా పార్టీల సంగతి... ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల విషయం చెప్పాల్సిన పనిలేదు. యాభై ఏళ్లు దాటినవారు కూడా రాజకీయాల్లో యువ నాయకులుగా చెలామని అవుతుంటే.. అసలు రిటైర్మెంట్ అనే పదానికి అర్ధం ఉందా? అని మనం సర్దిచెప్పుకోవాల్సి ఉంటుంది.
వైఎస్ 60 ఏళ్లకే రిటైర్...!
ఉమ్మడి ఏపీలో దాదాఉ మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అసలు రాజకీయాల్లో రిటైర్మెంట్ అనే ఆలోచన లేదా ప్రతిపాదన తెచ్చిందే వైఎస్ అనుకోవాలేమో..? 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినది మొదలు.. 2004 వరకు మధ్యలో రెండు మూడేళ్లు మంత్రి, ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడం తప్ప వైఎస్ రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షం లేదా సొంత పార్టీ కాంగ్రెస్ లో అసమ్మతి పక్షంగా సాగింది. 1999-2004 మధ్య ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం, సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తెచ్చారు. ఆ సమయంలో ఓసారి తాను 60 ఏళ్లకు రిటైర్ అవుతానని, 2004 ఎన్నికలే చివరివి అని కూడా ప్రకటించారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. కాలు కదలని స్థితిలోనూ పదవికోసం పాకులాడే రాజకీయ నాయకులు ఉన్నారు కానీ.. ఎంతో భవిష్యత్ ఉండగా 60 ఏళ్లకే రిటైర్ అవుతానని ప్రకటించడం వైఎస్ విలక్షణతను చాటింది. ఇక 2009 ఎన్నికల్లో ఆయన మరోసారి పార్టీని గెలిపించి సీఎం అయ్యారు. ఆ ఏడాది జూలై 7కు వైఎస్ కు 60 ఏళ్లు నిండాయి. కానీ, రిటైర్మెంట్ ప్రతిపాదనను మాత్రం ఆయన అమలు చేయలేదు. అయితే, మాట తప్పని రాజన్న.. అదే ఏడాది సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయి ఈ లోకాన్ని వీడారు. పరోక్షంగా అయిన తన మాటను నిలబెట్టుకున్నారు.
బీజేపీలో మోదీకి వర్తించలేదు...
కొన్ని దశాబ్దాల కిందట బీజేపీ 70 ఏళ్లు దాటిన తమ నాయకులకు క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవాలనే నిబంధనను తెచ్చింది. కొందరు ముఖ్య నాయకులనే పక్కనపెట్టింది. కానీ, ప్రధాని మోదీ విషయంలో మాత్రం ఈ రూల్ ను వర్తింపజేయలేదు. ఈ సెప్టెంబరు 17తో మోదీ 75 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. కానీ, ఆయన పదవికి మాత్రం ఢోకా లేదనేది ఖాయం.
రేవంత్ 70 ఏళ్ల తర్వాత రిటైర్...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాను 2040 వరకు తాను రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పారు. అంటే ఆయన 70 ఏళ్ల వయసు వరకు రాజకీయాల్లో ఉంటారని పరోక్షంగా చెప్పినట్లే అన్నమాట. 1969లో పుట్టిన రేవంత్ కు 2040తో 70 ఏళ్లు వస్తాయి. ఇక తెలంగాణకు రెండో సీఎంను కావడం తనకు దక్కిన గొప్ప అవకాశంగా చెబుతున్న ఆయన... పదేళ్లు (వరుసగా రెండో టర్మ్) సీఎం తానేనని కూడా గట్టిగా చెబుతున్న సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎన్నికల్లో గెలుపు ఓటములను బట్టి, అధిష్ఠానం నిర్ణయాన్ని బట్టి పరిస్థితులు ఉంటాయని అనుకోవచ్చు.
మరి చంద్రబాబో..?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ అయిన ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు 75 ఏళ్లు. ఇప్పటికే ఉమ్మడి ఏపీకి రెండుసార్లు, విభజిత ఏపీకి రెండుసార్లు సీఎం అయ్యారు. 2029 ఎన్నికల నాటికి ఆయనకు 79 ఏళ్లు వస్తాయి. అయితే, చంద్రబాబు దశాబ్దాల కిందటే తన జీవనశైలిని మార్చుకున్నారు. కఠిన ఆహార నియమాలతో నిత్యం చురుగ్గా ఉండేలా చూసుకున్నారు. అందుకే 75 ఏళ్ల వయసులోనూ అలా హుషారుగా కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు కూడా చంద్రబాబు ఇంతే ఉత్సాహంతో వెళ్తారనడంలో సందేహం లేదేమో..?
