కొత్త పాత్రలో ఐపీఎస్ సునీల్ కుమార్ : సస్పెన్షన్ లోనే రిటైర్మెంట్
సీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ ఇకపై కొత్త పాత్రలో కనిపించబోతున్నారా? అన్న చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 29 Jun 2026 7:45 PM ISTసీనియర్ పోలీసు అధికారి పీవీ సునీల్ కుమార్ ఇకపై కొత్త పాత్రలో కనిపించబోతున్నారా? అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం డీజీ కేడర్ లో ఉన్న సునీల్ కుమార్ మంగళవారం రిటైర్ కానున్నారు. ఆయనతోపాటు అఖిల భారత సర్వీసులకు చెందిన ముగ్గురు అధికారులు రిటైర్ అవుతుండగా, మిగిలిన ఇద్దరిని గౌరవంగా రిటైర్మెంట్ ఇచ్చిన ప్రభుత్వం, సునీల్ కుమార్ విషయంలో కఠినంగా వ్యవహరించిందని అంటున్నారు. రిటైర్మెంట్ నేపథ్యంలో సునీల్ కుమార్ పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి ఏదో ఒక పోస్టింగ్ ఇస్తారని, ఆ విధంగా రిటైర్మెంట్ సాఫీగా అయ్యేలా ప్రభుత్వం చూస్తుందని ఆయన సన్నిహితులు ఎదురుచూశారు. కానీ సునీల్ కుమార్ పై తీవ్రమైన అవినీతి కేసులతోపాటు రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు పెండింగులో ఉండటంతో సస్పెన్షన్ యథావిధిగా కొనసాగించారని చెబుతున్నారు. దీంతో అత్యంత అవమానకరంగా సీనియర్ పోలీసు అధికారి సస్పెన్షన్ లో రిటైర్ కావాల్సివచ్చిందని అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎస్పీగా, రాష్ట్ర పోలీసు శాఖలో కీలక బాధ్యతలు చేపట్టిన సీనియర్ అధికారి సునీల్ కుమార్ రిటైర్మెంట్ మాత్రం మొత్తం కెరీర్ కు మచ్చగా మిగిలిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఇకపై ఆయనను కొత్త అవతారంలో చూసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ విధుల్లో ఉండటంతో ఆయన ఒక స్థాయి వరకే మాట్లాడేవారని, రిటైర్ అవ్వడంతో ఆయనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని అంటున్నారు. దీంతో భవిష్యత్తులో సునీల్ కుమార్ నుంచి తీవ్రమైన పోరాటం ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం అంబేద్కర్ ఇండియా మిషన్ (ఏఐఎం) అన్న పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్న సునీల్ కుమార్ దళితులు, కాపులు ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. సమాజంలో వెనకబడిన ఈ రెండు వర్గాలు కలిస్తే రాజ్యాధికారం వస్తుందని ఆయన తరచూ చెబుతుంటారు. సస్పెన్షన్ కాలంలోనూ ఇదే ప్రచారంతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. అయితే ప్రభుత్వ విధుల్లో ఉండటంతో కొంత పరిమితి వరకే ఆయన మాట్లాడేవారని అంటున్నారు. ఇప్పుడు రిటైర్ కానుండటంతో ఈ విషయంలో ఆయన స్పీడు పెంచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
మరోవైపు ఆయన వైసీపీలో చేరుతారా? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. కొన్నేళ్లుగా ఎయిమ్ అనే తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓ వర్గం కోసం పనిచేస్తున్న సునీల్ కుమార్ పరోక్షంగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. అదే సమయంలో గత ప్రభుత్వంలో ఆయన పనితీరుపై టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు, సస్పెన్షన్ ఎదుర్కొన్న సునీల్ కుమార్ ఇప్పుడు వైసీపీలో చేరి తన పోరాటానికి రాజకీయంగా మద్దతు పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు సునీల్ కుమార్ - వైసీపీ మధ్య ఉన్న సానిహిత్యం.. ఇక రాజకీయ బంధంగా మారితే ఆ ఫలితం ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాల్సివుందని అంటున్నారు.
