ప్రవీణ్ ప్రకాష్ సంచలన వీడియో.. బహిరంగ క్షమాపణలు చెప్పిన రిటైర్డ్ ఐఏఎస్
సంచలనాలకు మారుపేరైన రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ మరో సంచలనానికి తెరతీశారు. రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కు బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు.
By: Tupaki Political Desk | 12 Nov 2025 4:58 PM ISTసంచలనాలకు మారుపేరైన రిటైర్డ్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ మరో సంచలనానికి తెరతీశారు. రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు, సీనియర్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ కు బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ప్రవీణ్ ప్రకాష్ సుమారు 16 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మీడియాకు షేర్ చేశారు. ఆ వీడియోలో గత ప్రభుత్వంలో తాను నడుచుకున్న విధానంపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన సర్వీసులో జరిగిన పొరపాట్లను ప్రస్తావించారు. ఇకపై తనలో రెండో యాంగిల్ చూస్తారంటూ చెప్పుకొచ్చారు.
ప్రవీణ్ ప్రకాష్ విడుదల చేసిన వీడియో ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది. కొద్దిరోజుల క్రితం సీనియర్ పాత్రికేయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఆయనే సొంతంగా అనేక విషయాలను ప్రస్తావిస్తూ వీడియోను రిలీజ్ చేయడం సంచలనంగా మారింది. ప్రవీణ్ ప్రకాష్ వీడియో ఏముందని అంతా సెర్చ్ చేస్తున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ మాటల్లో.. ‘‘1994 బ్యాచ్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని. గత ఏడాది విజయవాడలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్‌కు గురయ్యాను. ట్రోలింగ్ సమయంలో చాలా ఆలోచించాను. 30 ఏళ్లుగా ఆంధ్రాలో పనిచేశాను. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. రూల్స్ కి విరుద్ధంగా నడుచుకోలేదు. నా జూనియర్స్ ను సైతం చట్టానికి విరుద్ధంగా పనిచేయమని చెప్పలేదు. అంత కచ్చితంగా పనిచేసినప్పుడు ట్రోలింగ్ జరగడాన్ని తీవ్రంగా ఆలోచించాను. నన్నెందుకు ట్రోల్ చేస్తున్నారని అనుకున్నాను. ఆ సమయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు.
జులై ఫస్ట్ వీక్ లో వీఆర్ఎస్ కి అప్లై చేశాను. ప్రభుత్వం ఆమోదించింది. ఆ తర్వాత అక్టోబరులో ఢిల్లీకి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఆలోచించాను. ఏం తప్పు చేశాను అని ప్రశ్నించుకున్నాను. 2000-2004 వరకు గుంటూరు, విజయవాడలో మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశా.. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయి. నేను హైదరాబాద్ వెళ్లినా, ఢిల్లీలో ఉన్నా లండన్, న్యూయార్క్ ఇలా ఎక్కడికి వెళ్లినా నాకు గుంటూరు, విజయవాడ వారు వచ్చి కలిసేవారు. వారి కళ్లలో నాపై ఎంతో ఆప్యాయత కనిపించేది. కానీ, సడన్ గా నేను ఏ తప్పు చేశాను. హీరోగా ఉన్న నేను విలన్ గా మారిపోయాను అని అనుకున్నాను. దీనిపై చాలా ఆలోచించాను. చివరికి తెలుసుకున్నాను. నేను సమాజం ఆలోచనలకు తగ్గట్టు పనిచేయలేకపోయాను. ఆ టెస్ట్ ఫెయిల్ అయినందునే విలన్ అయ్యాను.’’ అంటూ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
ఇక 2020లో జీఏడీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు చోటుచేసుకున్న వ్యవహారాన్ని ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘ఆ సమయంలో నాకు ఒక ఫైల్ వచ్చింది. డీజీపీ నుంచి వచ్చిన ఆ ఫైల్ లో ఏడీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుది. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ ఫైల్ లో ఉంది. ఆ ఫైల్ చూస్తే ఏబీ సివిల్ సర్వీసెస్ రూల్స్ కు అతీతంగా పనిచేశారని అనిపించొచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో సివిల్ సర్వీసెస్ రూల్స్ లో చాలా ప్రొవిజనల్స్ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా నా వద్దకు ఫైల్ వచ్చింది. ఏబీవీ నాకన్నా సీనియర్. అయితే ఆయనపై వచ్చిన అభియోగాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సివచ్చింది. కానీ, అది నైతికంగా కరెక్టు కాదని తర్వాత నాకు అర్థమైంది. అదేవిధంగా ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ వ్యవహారంలో కూడా జరిగింది. నావల్ల ఏబీవీ, కృష్ణ కిశోర్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇద్దరికీ ఫోన్ చేసి క్షమించమని అడిగాను. ఈ వీడియో ద్వారా మరో సారి సారీ చెబుతున్నాను.’’ అని ప్రవీణ్ ప్రకాష్ స్పష్టం చేశారు.
