హోటళ్లా మజాకా: తిన్నదానికే కాదు.. వాడిన గ్యాసుకూ బిల్లు!
దేశవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా.. అనేక హోటళ్లు మూతబడ్డాయి. ఇక, కొన్ని చోట్ల ఎలాగోలా హోటళ్లను కొనసాగిస్తున్నారు.
By: Garuda Media | 13 March 2026 3:45 PM ISTదేశవ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా.. అనేక హోటళ్లు మూతబడ్డాయి. ఇక, కొన్ని చోట్ల ఎలాగోలా హోటళ్లను కొనసాగిస్తున్నారు. కానీ, చిత్రం ఏంటంటే.. వినియోగదారులు తిన్న పదార్థాల బిల్లుతో పాటు.. ఆయా పదార్ధాలు వండేందుకు అయిన గ్యాస్ ఖర్చును కూడా బిల్లు రూపంలో వినియోగ దారుల నుంచి వసూలు చేస్తున్నారు. చెన్నై, బెంగళూరు, విజయవాడలలో ఈ చిత్రమైన బిల్లులు వేసి.. వినియోగదారుల నుంచే సొమ్ము తీసుకుంటున్నారు.
బెంగళూరులోని ఓ హోటల్ లో పెసరదోశ, చికెన్ కర్రీ తిన్న వినియోగదారుడికి ఆయా పదార్ధాలకు అయిన ఖర్చుతో పాటు గ్యాస్ ఖర్చు కింద.. రూ.30 రూపాయలు బిల్లులో వడ్డించారు. ఇక, చెన్నైలో ఓ వినియోగదారుడు ఇడ్లీ, వడ తిన్నారు. దీనికిగాను 66 రూపాయలు బిల్లు చేశారు. అయితే.. వీటి తయారీకి వినియోగించిన గ్యాస్ ఖర్చు కింద మరో 9 రూపాయలను బిల్లులో వడ్డించారు. విజయవాడలోనూ ఇదే తరహాలో గ్యాస్ ఖర్చులు వసూలు చేస్తున్నారు.
ఈ వ్యవహారంపై చెన్నై, బెంగళూరు వినియోగదారుల హక్కులకమిషన్లు సీరియస్ అయ్యాయి. గ్యాస్ ఖర్చు అనేది.. తిన్న పదార్థంలోనే జమ అయి ఉంటుందని.. ప్రత్యేకంగా గ్యాస్ ఖర్చులు తీసుకుంటే.. కఠిన చర్యలు తీసుకుని హోటళ్లకు సీలు వేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు.. హోటల్ నిర్వాహకులు.. మాత్రం ఇలా చేయడం తప్పడం లేదని.. గ్యాస్ కొరత కారణంగా తాము బ్లాక్‌లో బండలు కొనుగోలు చేయాల్సి వస్తోందని.. దీనికి వేల రూపాయలను అదనంగా ఖర్చు చేస్తున్నామని చెబుతున్నారు.
ఇక, ఏపీలో పరిస్థితి కూడా అలానే ఉంది. విజయవాడలో చాలా వరకు హోటళ్లు, రోడ్డు పక్కన పెట్టుకునే టిఫిన్ బండ్లను తగ్గించేశారు. అంతేకాదు.. నిరంతరం గ్యాస్ అవసరం అయ్యే దోశ పెనాలను తీసేశారు. కేవలం ఇడ్లీ మాత్రమే అందుబాటులో ఉందని బోర్డులు పెడుతున్నారు. వీటికి తక్కువ గ్యాస్ ఖర్చవుతుందని.. అందుకే ఇడ్లీ మాత్రమే పరిమితంగా వినియోగదారులకు అందిస్తున్నామని హోటల్ యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం పరిస్థితి బాగానే ఉందని చెబుతోంది. మరో వారం వరకు ఎలాంటి ఇబ్బందులు రావలని అంటోంది.
