Begin typing your search above and press return to search.

బ్యాంకుల‌కు చేర‌ని 2వేల నోట్లు ఎన్ని వేల కోట్లో తెలుసా?

ఇదే క్రమంలో ఈ ఏడాది మే 19న రిజర్వ్ బ్యాంక్ మరో కొత్త ఆదేశాలు జారీచేసింది. 2వేల నోటును ఉపసంహరించు కుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది

By:  Tupaki Desk   |   27 Sep 2023 3:59 AM GMT
బ్యాంకుల‌కు చేర‌ని 2వేల నోట్లు ఎన్ని వేల కోట్లో తెలుసా?
X

భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడోసారి నోట్ల రద్దు జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... నవంబర్ 8, 2016 న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎవరూ ఊహించని ప్రకటన ఒకటి వెలువడింది. దీంతో సుమారుగ దేశం మొత్తం ఏటీఎం ల వద్ద క్యూ కట్టేసింది. బ్యాంకుల వద్ద బారులు తీరింది. నాడు కరెన్సీ కోసం జనం పడిన పాట్లు అన్నీ, ఇన్నీ కాదనే కామెంట్లు వినిపించాయి.

అయితే ప్రధానంగా నోట్ల రద్దు కారణంగా అక్రమ నల్లధనాన్ని అరికట్టవచ్చని ప్రభుత్వం భావించని చెప్పుకొచ్చారు! అయితే రద్దు సమయానికి చెలామణిలో ఉన్న రూ.15.41 లక్షల కోట్ల విలువైన రూ.500, రూ.1000 నోట్లలో సుమారు రూ.15.31 లక్షల కోట్ల విలువైన నోట్లు తిరిగి వచ్చాయి. అంటే రూ.10,720 కోట్ల కరెన్సీ తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరలేదు. చేరిన నోట్లు మాత్రం 99.3% అని ఆర్బీఐ ప్రకటించింది.

ఇదే క్రమంలో ఈ ఏడాది మే 19న రిజర్వ్ బ్యాంక్ మరో కొత్త ఆదేశాలు జారీచేసింది. 2వేల నోటును ఉపసంహరించు కుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. దీనికోసం సెప్టెంబర్ 30ని గడువు తేదీగా ప్రకటించింది. అంటే... ఇక కేవలం నాలుగురు రోజులే ఉన్నాయన్నమాట. అయితే మే 19 - సెప్టెంబర్ 1 నాటికి సుమారు 93 శాతం పెద్ద నోట్లు బ్యాంకులకు చేరాయని తెలుస్తుంది.

ఈ సమయంలో ఖాతాదారులు తమ ఖాతాల్లో 2వేల నోట్లు డిపాజిట్లు చేసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఇలా తిరిగి బ్యాంకులకు వచ్చిన 93శాతం సంగతి పక్కనపెడితే.. మిగతా 7 శాతం పెద్ద నోట్ల సంగతేంటనే చర్చ మొదలైంది. కారణం సెప్టెంబర్ 1 వరకూ బ్యాంకులకు చేరని 2వేల నోట్ల విలువ అక్షరాలా 24వేల కోట్ల రూపాయలు.

దీంతో సెప్టెంబర్ 1 నుంచి ఈ రోజు (సెప్టెంబర్ 27) వరకూ మిగిలిన ఆ 7 శాతం పెద్ద నోట్లు వెనక్కి వచ్చినట్టేనా.. ఈ రోజుతో కలిపి ఇంకా కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్నందున ఆ మిగిలిన నోట్ల పరిస్థితి ఏమిటి అనేది ఆసక్తిగా మారింది. మరి ఈ విషయాలపై ఆర్బీఐ వివరాలు వెల్లడిస్తే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అయితే నోట్ల రద్దు వల్ల సామాన్యుడు మాత్రమే ఇబ్బందిపడ్డాడు తప్ప ధనికులు ఎవరూ ఇబ్బంది పడలేదని, ఎవరి మార్గాల్లో వారు సులువుగా మార్చేసుకున్నారని అంటుంటారు.

మరోపక్క ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని, అందువల్ల సెప్టెంబర్ 30 తర్వాత 2 వేల రూపాయల నోట్ల ఉపసంహరణకు గడువు పెంచాల్సిన అవసరం లేదని అన్నట్లుగా అధికారులు భావిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా... ఈ నెల 30 తర్వాత 2వేల నోటు ఇక కనిపించదన్నమాట. ఫలితంగా ఇకపై ఇండియాలో 500 నోటే పెద్ద నోటుగా చెలామణి అవ్వనుంది!

కాగా... 2016 నోట్లు రద్దు తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 వేల నోటును తీసు‍కొచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం 2018-19లో ఈ 2,000 నోట్ల ముద్రణ పూర్తిగా నిలిపివేసినట్టు ఆర్బీఐ పేర్కొంది. అంతకంటే ముందు 2017 మార్చిలో 89 శాతం నోట్లు జారీ చేయగా.. వాటి జీవితకాలం 4-5 సంవత్సరాలు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే 19న వాటిని రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది.

అంతకముందు 1946లో చింతామన్ ద్వారకానాథ్ దేశ్‌ ముఖ్‌ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌ గా ఉన్న సమయంలో రూ.500, అంతకన్నా ఎక్కువ విలువ కలిగిన రూ.1000, రూ.10,000 కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ లు జారీ చేశారు. అనంతరం 1978లో రూ. 1,000, రూ.5,000, రూ.10,000 నోట్లు రద్దు చేయబడ్డాయి. అనంతరం నవంబర్ 8, 2016 న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.