Begin typing your search above and press return to search.

వార్షిక ద్రవ్య బిల్లుకు చుక్కలు చూపిస్తున్న రిపబ్లికన్లు

పాలన విషయంలో మన దేశం తరహాలో అమెరికా విధానాలు ఉండవు. కొన్ని విషయాల్లో తేడాలుఉంటాయి.

By:  Tupaki Desk   |   30 Sep 2023 4:51 AM GMT
వార్షిక ద్రవ్య బిల్లుకు చుక్కలు చూపిస్తున్న రిపబ్లికన్లు
X

పాలన విషయంలో మన దేశం తరహాలో అమెరికా విధానాలు ఉండవు. కొన్ని విషయాల్లో తేడాలుఉంటాయి. ప్రతి ఏటా ఖర్చు పెట్టే ఖర్చులకు సంబంధించిన ద్రవ్యబిల్లును ఉభయ సభల ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం బైడెన్ సర్కారు అధికారంలోఉన్నప్పటికీ అక్కడి పార్లమెంటులోని దిగువ సభలో రిపబ్లికన్లకు మెజార్టీ ఉంది. దీంతో.. వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదంపై వారు పెడుతున్న కండీషన్లు బైడెన్ సర్కారుకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా వార్షిక ద్రవ్య బిల్లు ఆమోదం విషయంలో రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్న అంశాలతో బిల్లు ఆమోదంపై కొత్త టెన్షన్ పట్టుకుంది.

చివరకు వరకు ఇలాంటి టెన్షన్ తీసుకొచ్చి.. చివర్లో ఆర్థిక సంక్షోభం చోటు చేసుకోకుండా సర్లేమని.. ఓకే చేయటం అప్పుడప్పుడు చేస్తుంటారు. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొంది. అక్టోబరు ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరం చెల్లింపులన్నీ జరగాలంటే వార్షిక ద్రవ్యబిల్లు ఆమోదం పొందాలి. దీనిపై రిపబ్లికన్లు కొర్రీల మీద కొర్రీలు వేస్తున్నారు. దీంతో.. ఏం జరుగుతుందన్నది ప్రశ్నగా మారింది. ద్రవ్య బిల్లు ఆమోదం పొందని పక్షంలో చెల్లింపులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. కొత్త తరహా ఆర్థిక సంక్షోభం చోటు చేసుకుంటుంది.

వార్షిక ద్రవ్యబిల్లు ఆమోదంపై రిపబ్లికన్ల అభ్యంతరాన్ని చూస్తే.. ఒక విషయాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సరిహద్దు భద్రత సహా పలు ఏజెన్సీల చెల్లింపుల కోసం వారు ప్రతిపాదించిన మొత్తాల్లో 30 శాతం మేర నిధుల కోత విధించారు. అయినప్పటికీ.. ఇది మరింత ఉండాలన్నది రిపబ్లికన్ల వాదన. అదే సమయంలో ఉక్రెయిన్ కు నిధులు ఇవ్వాలన్న బిల్లును వీటో చేయదలిచారు.

తాజాగా నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు బైడెన్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్నా.. అవేమీ ఫలించటం లేదు. దీంతో.. ఏం చేయాలన్నది ఇప్పుడు పాలుపోవటం లేదంటున్నారు. ఎన్నికల సంవత్సరంలో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్న రిపబ్లికన్ల (ట్రంప్ కూడా ఈ పార్టీకి చెందిన వారే) తీరుపై డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ఆమెరికా కాలమానం ప్రకారం శనివారం లోపు ప్రభుత్వ ద్రవ్య బిల్లుకు ఆమోదం లభించకుంటే ఫెడరల్ ప్రభుత్వ విభాగాలకు చెల్లింపులన్నీ నిలిచిపోతాయి. అదే జరిగితే.. సైనికుల జీతాలే కాదు.. వివిధ పథకాలకు ప్రభుత్వం విడుదల చేసే నిధులు కూడా ఆగిపోయి.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆఖరి క్షణం వరకు టెన్షన్ పెట్టి.. సర్లే అంటూ చివర్లో రిపబ్లికన్లు ఓకే చెప్పొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.