Begin typing your search above and press return to search.

అయితే సోనియా.. లేకుంటే రేణుకా అంట!

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకూ సిద్ధపడుతున్నారు

By:  Tupaki Desk   |   18 Jan 2024 11:28 AM GMT
అయితే సోనియా.. లేకుంటే రేణుకా అంట!
X

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికలకూ సిద్ధపడుతున్నారు. పైగా ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు రేవంత్ సీఎం పొస్ట్ డ్యూరేషన్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న నేపథ్యంలో... ఈ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపొందాలని రేవంత్ గట్టిపట్టుమీద ఉన్నారని అంటున్నారు. ఈ సమయంలో రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... వరుసగా కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తాచాటాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఖమ్మం జిల్లాలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ... ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తారని అంటున్నారు. ఈ విషయాలపై రేణుకా చౌదరి స్పందించారు.

ఇందులో భాగంగా... ఖమ్మం లోక్‌ స‌భ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిని తానేనని ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంటుకి తానే పోటీ చేస్తానని, తాను సీటు అడిగితే కాదనేవారు లేరని చెప్పుకొచ్చారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో మాట్లాడిన ఆమె... ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ అనే విషయంపైనా స్పందించారు.

ఇందులో భాగంగా... ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కోరినట్లు చెప్పారు రేణుకా చౌదరి. అయితే ఈ కోరికపై ఆమె నిర్ణయం వెల్లడించే వరకు ఓపికతో ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమయంలో సోనియా గాంధీ ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయకపోతే.. ఇక ఇక్కడ అభ్యర్థిని తానేనని, ఇంకెవరికీ పోటీ చేసే ఛాన్స్ లేదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో... అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని రేణుకా చౌదరి తెలిపారు. అసలు నిరుద్యోగ సమస్య పైనే రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిందని, ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఖమ్మం అభివృద్ధికి పాటుపడతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఇక అయోధ్య రామమందిరం కార్యక్రమాన్ని ఎన్నికల కోసం వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందులో భాగంగానే నిర్మాణం పూర్తి కాకముందే ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారని.. అలా చేయడం సరికాదని రేణుకా చౌదరి అన్నారు. ఇక అయోధ్యకు బీజేపీ నేతలు ఆహ్వానిస్తే వెళ్లాల్సిన అవసరం తనకు లేదని.. తన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా అని.. అందుకు ఎవరి అనుమతీ అవసరం లేదని ఫైరయ్యారు.

కాగా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ.. మల్కాజ్ గిరి స్థానం నుంచి... కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ.. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచీ పోటీచేస్తారని గతకొన్ని రోజులుగా కథనాలొస్తున్న సంగతి తెలిసిందే.