Begin typing your search above and press return to search.

అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏంపని: షర్మిలపై రేణుకా చౌదరి ఆగ్రహం!

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి వడివడిగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Sep 2023 4:55 AM GMT
అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏంపని: షర్మిలపై రేణుకా చౌదరి ఆగ్రహం!
X

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరడానికి వడివడిగా అడుగులు పడుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆమె ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అగ్ర నేతలు.. సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలతో పార్టీ విలీనం గురించి చర్చించారు. కాంగ్రెస్‌ లోకి ఆమె రాకను పలువురు నేతలు కూడా ఆహ్వానిస్తున్నారు. షర్మిల తెలంగాణలోని పాలేరు సీటు ఆశిస్తున్నారు. అయితే ఈ సీటుకు భారీ డిమాండ్‌ నెలకొని ఉంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు.. కాంగ్రెస్‌ లో చేరితే ఆ సీటును ఆయనకు ఇవ్వొచ్చని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిలపై కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోడలనని ఆమెకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. పాలేరులో పోటీ చేస్తాను అని షర్మిల అనడంపై ఆమె మండిపడ్డారు. పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలున్నారా?.. ఆమె పోటీ చేయడానికి అంటూ సెటైర్లు వేశారు.

అసలు ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని అని రేణుక ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల ముందు అమరావతిలో రైతుల గురించి మాట్లాడాలన్నారు. తెలంగాణలో షర్మిల ఎంతో.. ఏపీలో తాను కూడా అంతే అన్నారు. తాను ఏపీ కోడలిని, తెలంగాణ ఆడబిడ్డను అని గుర్తు చేశారు.

షర్మిల తెలంగాణలో పోటీ చేసే విషయంలో కాంగ్రెస్‌ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రేణుకా చౌదరి తెలిపారు. దీనిపై హైకమాండ్‌ తుది నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ''మా కార్యకర్తలు ఎవరి పేరు చెబుతారో పాలేరు నుంచి వారు నిలబడితేనే అందంగా ఉంటుంది. షర్మిల పాలేరులో పుట్టిందా? పాలేరుకి ఏమైనా చేసిందా? పాలేరును అభివృద్ధి చేశారా?'' అని రేణుకా చౌదరి మండిపడ్డారు.

ఏ సమస్యను షర్మిల పరిష్కరించారు? అని రేణుకా చౌదరి నిలదీశారు. ఊరు పేరు లేని వాళ్లు అంతా వచ్చి వాలితే.. రాజకీయ రాబందులు అంటారని ఘాటుగా వ్యాఖ్యానించారు. తెలంగాణ కోడలు అని ఇవాళ గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు. ఇన్ని సంవత్సరాలు షర్మిల ఎక్కడున్నారు? నిలదీశారు.

షర్మిల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా ఇదే వైఖరితో ఉన్నారని టాక్‌ నడుస్తోంది. షర్మిలకు ఏపీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించాలని ఆయన గతంలోనే వ్యాఖ్యానించారు. ఏపీ నేతలు వచ్చి తెలంగాణలో పెత్తనం చేస్తామంటే సహించబోమన్నారు. రేవంత్‌ బాటలోనే ఇప్పుడు రేణుకా చౌదరి కూడా షర్మిల రాకను వ్యతిరేకిస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఆమె వ్యాఖ్యలపై షర్మిల ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.