చంద్రబాబుపై రేణుకా చౌదరి వ్యాఖ్యల కలకలం.. వీడియో వైరల్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 2 July 2025 10:22 AM ISTఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రాఫ్ పడిపోయిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న రేణుకా చౌదరి.. ఆయన ఏడాది పాలనపై విమర్శలు చేయడం రాజకీయంగా సంచలనం సృష్టించాయి. బీజేపీ చెప్పినట్లు చంద్రబాబు తల ఊపుతున్నారని వ్యాఖ్యానించిన రేణుక చౌదరి ఇలా చెబుతున్నందుకు తనను క్షమించాలని కోరారు. చంద్రబాబు నాయకత్వంపై రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా వైసీపీ ఈ వీడియోను ట్రెండింగ్ చేస్తోంది.
జగన్ ఓడిపోయి చంద్రబాబు వస్తే ఏదో ఉద్దరిస్తారని అంతా భావించామని, కానీ, ఆయన కేంద్రంలోని బీజేపీ చెప్పినట్లుగా వ్యవహరిస్తున్నారని రేణుకా చౌదరి దుయ్యబట్టారు. బీజేపీ వాళ్లు చేతులు పట్టుకుని , వాళ్లు చెప్పినట్లు ముందు చూపు లేకుండా వ్యవహరించడం చంద్రబాబు చేస్తోన్న పెద్ద తప్పుగా రేణుగా చౌదరి అభివర్ణించారు. చంద్రబాబు పాలన కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూశామని, కానీ ఆ ఆశలకు తగ్గట్టు చంద్రబాబు పాలించడం లేదని రేణుక చౌదరి పెదవి విరిచారు.
చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఆయనకు మధ్య గ్యాప్ వచ్చినట్లు కనిపిస్తోందని రేణుకా చౌదరి చెప్పారు. ఈ ఏడాదిలో ఆకట్టుకునేలా చంద్రబాబు నిర్ణయాలు ఏవీ లేవన్నారు. ఏడాది పాలనలో ఆయన పూర్తిగా నిరాశ పరిచారని, పాలనలో ఆయన సొంత నిర్ణయాలు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. గతంలో జగన్ పాలనపై తీవ్రంగా విమర్శలు చేసిన రేణుకా చౌదరి పరోక్షంగా టీడీపీకి బాసటగా నిలిచారు. అమరావతి రైతులకు మద్దతుగా వారు చేసిన ధర్నాలకు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించిన ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఇప్పుడు చంద్రబాబును తప్పుపట్టడంపై పెద్ద చర్చ జరుగుతోంది.
