Begin typing your search above and press return to search.

మాటలే కాదు.. చేతల్లోనూ 'రేవంతుడే'

ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు.

By:  Tupaki Desk   |   11 July 2025 5:11 PM IST
మాటలే కాదు.. చేతల్లోనూ రేవంతుడే
X

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం కీలక వ్యాఖ్యలతో మార్మోగిపోయింది. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి చర్యను ఆమె చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు.

"రాజకీయ నాయకులు ఎన్నో మాటలు చెప్పారు కానీ, ఆ మాటలకు అర్థం వచ్చేలా చేసి చూపించింది మాత్రం సీఎం రేవంత్ రెడ్డి" అని రేణుకా చౌదరి స్పష్టం చేశారు. ఇది కేవలం రాజకీయ నిర్ణయం కాదని, సామాజిక న్యాయానికి, సమానత్వానికి నాంది అని ఆమె పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా తెలంగాణ ఒక ఆదర్శంగా నిలుస్తోందని ఆమె గర్వంగా తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ ఇది గర్వించదగిన విషయం అని అన్నారు.

రేణుకా చౌదరి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, "రాజీవ్ గాంధీ ఒక్క సంతకంతో మహిళల జీవితాలను మార్చారు. ఇప్పుడు రాహుల్ గాంధీ హయాంలో బీసీలకు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. 42 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే మార్గదర్శిగా నిలుస్తుంది" అని ఉద్ఘాటించారు. ఈ నిర్ణయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిందని, తాను దేశవ్యాప్తంగా అనేక అభినందన సందేశాలు అందుకుంటున్నానని పేర్కొన్నారు. కార్యకర్తలలో ఎనలేని ఉత్సాహం కనిపిస్తోందని, న్యాయం చేయగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే అని ఆమె గర్వంగా ప్రకటించారు.

బీఆర్ఎస్ పార్టీపై కూడా రేణుకా చౌదరి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. "వాళ్లు పూటకోసారి పార్టీ పేరు మారుస్తుంటారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలి.. ఎందుకంటే వాళ్లు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మేమే అధికారంలో ఉంటాం" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌లో గ్రూపులు పుట్టుకొచ్చాయని, ఎమ్మెల్సీ కవిత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు.

చివరగా రేణుకా చౌదరి మాట్లాడుతూ, ‘‘ఇన్ని సంవత్సరాలుగా నాయకులు చెప్పింది ఖాళీ మాటలే. కానీ ఇప్పుడు రాష్ట్రానికి అసలైన నాయకుడు లభించాడు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చారిత్రక నిర్ణయం దేశానికే మార్గం చూపుతుంది. చేతి గుర్తు అన్నది దేశాన్ని ముందుకు నడిపే సత్తా ఉన్న చిహ్నం’’ అని ముక్తకంఠంతో పేర్కొన్నారు. సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్‌కు తిరిగి శక్తినిచ్చి, మునుపటి వైభవాన్ని తెస్తుందనే విశ్వాసం ప్రజలలో బలపడుతోంది.