Begin typing your search above and press return to search.

HCU భూవివాదంపై రేణుదేశాయ్ సంచలన వీడియో.. బయటపెట్టిన వాట్సాప్ చాట్

నటి రేణూ దేశాయ్ పర్యావరణం, మూగజీవుల పట్ల తనకున్న ప్రేమను చాలా సందర్భాల్లో చాటుకున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2025 9:55 AM IST
HCU భూవివాదంపై రేణుదేశాయ్ సంచలన వీడియో.. బయటపెట్టిన వాట్సాప్ చాట్
X

నటి రేణూ దేశాయ్ పర్యావరణం, మూగజీవుల పట్ల తనకున్న ప్రేమను చాలా సందర్భాల్లో చాటుకున్నారు. ఆమె ఒక స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు. తాజాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) పరిధిలోని భూముల వివాదంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూమిని వేలం వేయాలని నిర్ణయించింది. దీని కోసం అధికారులు అర్ధరాత్రి జేసీబీలను పంపి చెట్లను నరికివేయడం, భూమిని చదును చేయడం వంటి చర్యలు చేపట్టారు. ఈ సమయంలో లేడి పిల్లలు భయంతో పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


ఈ భూమిని వేలం వేయవద్దని బీజేపీతో పాటు హెచ్‌సీయూ విద్యార్థులు కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. మనుషులు తమ స్వార్థం కోసం చెట్లను, జంతువులను కూడా బతకనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చర్యలను ఆపలేమా అని ఆమె ప్రశ్నించారు.


అంతేకాకుండా, ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్' సినిమాలోని డైలాగులను గుర్తుచేస్తూ.. బయట కూడా ఇలాంటి నిజమైన హీరో ఉంటే బాగుంటుందని ఆమె ఒక వీడియోను షేర్ చేశారు. ఈ విషయంపై ఆమె తన సన్నిహితులతో జరిపిన వాట్సాప్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పంచుకున్నారు. ఆ చాట్‌లో న్యాయవాదుల బృందం కలిసి పిటిషన్లు వేస్తే ఈ వేలాన్ని అడ్డుకోగలమని, హైకోర్టులో పోరాడాలని, అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని పేర్కొన్నారు.

ఈ వివాదంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా, లేక వేలం కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. ఈ వివాదంపై ఇప్పటికే నటులు, రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ రేవంత్ సర్కార్ ను తప్పుపడుతున్నారు. . ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో చూడాల్సి ఉంది.