ప్రేమకథల యందు ఈ ప్రేమకథ వేరయా.. 11 రాష్ట్రాలను వణికించిందయా!
ఈ క్రమంలో... అహ్మదాబాద్ నగరంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న 21 ప్రదేశాలను పేల్చివేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపింది.
By: Tupaki Desk | 25 Jun 2025 7:28 PM ISTప్రేమ కోసం త్యాగాలు చేసినవారు చాలామందే ఉంటారు. ప్రేమ ప్రేమనే కోరుకుంటుందని అంటారు. అయితే.. తాము కోరుకున్న వ్యక్తి తమకు దక్కలేదనే ఆగ్రహంతో రకరకాల పిచ్చి పనులు, మరికొన్ని క్రైమ్ పనులు చేస్తుంటారు. ఈ క్రమంలో రొటీన్ కి భిన్నంగా ఆలోచించిన ఓ మహిళా టెక్కీ.. షాకింగ్ పనికి పూనుకుంది. ఏకంగా 11 రాష్ట్రాలను వణికించేసింది.
అవును... చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రోబోటిక్స్ ఇంజనీర్ అయిన రెనే జోషిల్డా.. నకిలీ బాంబు బెదిరింపులు పంపడంతో దేశంలోని 11 రాష్ట్రాల్లో అలారం గంటలు మోగించింది. ఎందుకిదంతా అంటే.. తాను ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోలేదన్న కోపంతో! ఈ కోపంతోనే 11 రాష్ట్రాలను హడలెత్తించింది.
వివరాళ్లోకి వెళ్తే... రెనే జోషిల్డా చెన్నైలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆపై రోబోటిక్స్ లో కోర్సును అభ్యసించింది. ఈ క్రమంలో ప్రస్తుతం చెన్నైలోని ప్రఖ్యాత డెలాయిట్ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో.. బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ సమయంలో, ఆమెకు దివిజ్ ప్రభాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. ఆమె తన కొలీగ్!
అతనితో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే.. అది వన్ సైడ్ లవ్ మాత్రమే. పైగా... ప్రభాకర్ ఎప్పుడూ ఈమె ఫీలింగ్స్ ని పట్టించుకోలేదని అంటున్నారు. అంతేకాదు.. ఈ ఏడాది ఈ ఫిబ్రవరిలో వేరొకరిని వివాహం చేసుకున్నారు కూడా. దీనితో ఆమె కోపం కట్టలు తెంచుకుంది, ఆగ్రహం హద్దులు దాటింది.
ఆ ఆగ్రహంలో ఓ నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా... ఎలాగైనా తన ప్రియుని ఇబ్బందుల్లోకి నెట్టాలని భావించింది. ఈ క్రమంలో ఓ భయంకరమైన ప్లాన్ చేసింది. దివిజ్ పేరిట అనేక నకిలీ ఇ-మెయిల్ ఐడీలను సృష్టించింది. తద్వారా అతడి పేరిట పలు హాస్పిటల్స్, స్కూల్స్, స్పోర్ట్స్ స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది.
ఈ క్రమంలో... అహ్మదాబాద్ నగరంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న 21 ప్రదేశాలను పేల్చివేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపింది. వీటిలో నరేంద్ర మోడీ స్టేడియంతో పాటు పలు కీలక ప్రదేశాలున్నాయి. ఈ విషయాన్ని అహ్మదాబాద్ జాయింట్ పోలీస్ కమీషనర్ తెలిపారు. ఇదే సమయంలో... ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్ పంపింది.
ఈ పని ఆమె ఎప్పటినుంచో చేస్తోందట. అయితే.. తన తెలివితేటలతో అనేక జాగ్రత్తలు తీసుకున్న రెనే.. ఒక సందర్భంలో ఒకే డివైజ్ నుంచి ఆమె ఒరిజినల్ మెయిల్ ఐడీలతో పాటు నకిలీ ఇ-మెయిల్ ఖాతాల్లోకీ లాగిన్ అయింది. దీంతో ఆమె ఐపీ అడ్రస్ దొరికేసిందని.. ఆ చిన్న అజాగ్రత్త ఆమెను పట్టించిందని పోలీసు అధికారి సింఘాల్ చెప్పారు!
