Begin typing your search above and press return to search.

మరో అరుణ తార అస్తమయం.. తెలుగు కమ్యూనిస్టు దిగ్గజం ఇకలేరు

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గొప్ప నాయకుడిని కోల్పోయింది...వామపక్ష ఉద్యమం మరో వేగుచుక్కను కోల్పోయింది..

By:  Tupaki Desk   |   23 Aug 2025 9:14 AM IST
మరో అరుణ తార అస్తమయం.. తెలుగు కమ్యూనిస్టు దిగ్గజం ఇకలేరు
X

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) గొప్ప నాయకుడిని కోల్పోయింది...వామపక్ష ఉద్యమం మరో వేగుచుక్కను కోల్పోయింది.. మరో అరుణ తార అస్తమించింది.. తెలుగు గడ్డపై పుట్టి జాతీయ రాజకీయాల్లో రాణించిన నాయకుడు ఇక చాలని ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. నిరుడు సీపీఐ(ఎం- కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్కి‍్సస్ట్‌) ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం ఏచూరి మరణం.. ఇప్పుడు ఈ నాయకుడి మృతితో వామపక్ష రాజకీయాల్లో తెలుగువారి ప్రాతినిధ్యం తగ్గినట్లయింది.

కరువు జిల్లా పాలమూరు నుంచి..

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా అంటే ఒకప్పుడు కరువుకు మారు పేరు. అలాంటి జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించారు సురవరం సుధాకర్‌రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ వైతాళికుడిగా పేరుగాంచిన, గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాప్‌రెడ్డికి సమీప బంధువు. 83 ఏళ్ల సుధాకర్‌రెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జాతీయ పార్టీ అయిన సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సుధాకర్‌రెడ్డి.. 1942లో పుట్టారు. సమీపంలోని కర్నూలులో చదువుకున్నారు. 1964లో ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, 1967లో ఓయూలో ఎల్‌ఎల్‌బీ చదివారు.

నల్లగొండ నుంచి పార్లమెంటుకు..

సురవరం సుధాకర్‌రెడ్డి పుట్టింది పాలమూరులో అయినా.. రాజకీయ ప్రస్థానం నల‍్లగొండ నుంచి సాగింది. 1998, 2004 ఎన్నికల్లో రెండుసార్లు నల్లగొండ ఎంపీగా గెలుపొందారు సుధాకర్‌రెడ్డి. సీపీఐ 2004-09 మధ్య యూపీఏ ప్రభుత్వానికి కీలక మద్దతుదారు. 2012లో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన సురవరం ఏడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 2019లో వైదొలగారు.

ఉగ్గుపాలతోనే ఉద్యమం..

వామపక్ష వాదానికి ప్రభావితుడైన సురవరం.. 15 ఏళ్ల వయసులోనే ఉద్యమించారు. కర్నూలులో తాను చదువుతున్న పాఠశాలల్లో నల్లబోర్డులు, చాక్‌ పీస్‌ల, పుస్తకాలు కావాలని తోటి విద్యార్థులతో కలిసి ఆందోళన చేశారు. ఈ ఉద్యమం కర్నూలు జిల్లా అంతా వ్యాపించింది. సుధాకర్‌రెడ్డి ఇదే స్ఫూర్తితో విద్యార్థి రాజకీయాలు, వామపక్ష రాజకీయాల్లో కొనసాగించారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు.

అంకితభావానికి మరోపేరు..

కరుడుగట్టిన కమ్యూనిస్టు అంటే ఎలా ఉంటారో సురవరం సుధాకర్‌రెడ్డిని చూసి తెలుసుకోవచ్చు. 83 ఏళ్ల వయసులో ఆరోగ్యం అసలు బాగోలేకున్నా.. ఇటీవల ఆయన ఖమ్మంలో జరిగిన పార్టీ మహాసభల్లో పాల్గొన్నారు. తద్వారా పార్టీ పట్ల తన అంకితభావాన్ని చాటుకున్నారు.