మహాకవి శ్రీ శ్రీ అక్షరానికి ప్రతీ పైసా చెల్లించింది ఆ హీరోనే !
1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ బాల్యం యవ్వనం అంతా విశాఖ సాగర తీరంలోనే సాగింది. అనంతరం ఆయన సాహితీ ప్రస్థానం మద్రాస్ లో కొనసాగింది.
By: Satya P | 30 April 2026 11:31 AM ISTఆధునిక తెలుగు సాహితీ చరిత్రలో మహా కవులు అంటే ఇద్దరే కనిపిస్తారు. వారిలో ఒకరు గురజాడ అప్పారావు, మరొకరు శ్రీరంగం శ్రీనివాసరావు ఉరఫ్ శ్రీశ్రీ. శ్రీశ్రీ గొప్పతనం గురించి అందరికీ తెలిసిందే. ఆయన అక్షరాలనే ఆయుధాలుగా మార్చి జనం మెదళ్ళలో విప్లవాన్ని సృష్టించి పెత్తందార్ల గుండెలను గడగడలాడించారు. 1910 ఏప్రిల్ 30న విశాఖపట్నంలో జన్మించిన శ్రీశ్రీ బాల్యం యవ్వనం అంతా విశాఖ సాగర తీరంలోనే సాగింది. అనంతరం ఆయన సాహితీ ప్రస్థానం మద్రాస్ లో కొనసాగింది.
తెలుగు పాటకు గౌరవం :
తెలుగు సినిమా పాటకు జాతీయ గౌరవం తెచ్చిన వారు శ్రీశ్రీ. ఆయన 1974లో విడుదల అయిన అల్లూరి సీతారామరాజు సినిమాలో రచించిన తెలుగు వీర లేవరా పాటకు జాతీయ పురస్కారం లభించింది. అప్పటికి మునుపు తెలుగు సినిమా పాటకు ఈ రకమైన గుర్తింపు లేదు. తొలిసారి ఆ గౌరవాన్ని తెచ్చిన మహనీయుడుగా శ్రీశ్రీ తెలుగు సినీ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అది జరిగిన రెండు దశాబ్దాలకు వేటూరి సుందరరామమూర్తి రాసిన రాలిపోయే పువ్వా అన్న మాతృదేవోభవ మూవీలోని పాటకు రెండోసారి జాతీయ పురస్కారం దక్కింది అందుకే ఈ ఇద్దరూ తెలుగు సినిమా సాహిత్యానికి పూజనీయులు. చిరస్మరణీయులు.
మూడు దశాబ్దాల పయనం :
శ్రీశ్రీది తెలుగు సినిమా తో మూడు దశాబ్దాల ప్రయాణం. 1950లో ఆహుతి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి ప్రవేశించారు అది 1946లో విడుదలైన నీరా ఔర్ నందా చిత్రానికి తెలుగు డబ్బింగ్ వెర్షన్ మూవీ. అందులో పాటలను రాయడం ద్వారా సినీ గేయ రచయితగా శ్రీశ్రీ శుభారంభం పలికారు. ఆహుతి చిత్రంతోనే హంసవాలే ఓ పడవా, ఊగిసలదేనయ్య, ప్రేమయే జన్మన మరణ లీల వంటి హిట్ పాటలు రాసి బలమైన ముద్ర వేశారు. అలా శ్రీశ్రీ మొదటి పాటలకు సంగీత స్రష్ట సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.
ఎన్నో చైతన్య గీతాలు :
మహా కవి శ్రీశ్రీ ఎన్నో చైతన్య వంతమైన గీతాలను తెలుగు సినిమాకు అందించారు. ఒక అద్భుతమైన సినీ మాధ్యమాన్ని ఆయన ప్రజా చైతన్యం కోసం ఉపయోగించుకున్నారు. శ్రీశ్రీ రాసిన పాటలలో అధిక భాగం సమాజాన్ని మేలుకొలిపేవే అని చెప్పాలి. వెలుగు నీడలు సినిమాలో రాసిన పాడవోయి భారతీయుడా అంటూ ఆయన కలం కదల్చినా కురుక్షేత్రం వంటి పౌరాణిక సినిమాలో సైతం ధర్మ క్షేత్రం ఇది కురుక్షేత్రం అని టైటిల్ సాంగ్ రాసినా ఎక్కడా మానవ విలువలను కోల్పోలేదు. పేదలు శ్రామిక వర్గం సమస్యలను తన కలం ద్వారా చాటి చెప్పడం ఆపలేదు.
క్రిష్ణ అంటే అభిమానం :
మహాకవి శ్రీశ్రీ ఎన్టీఅర్ అక్కినేని వంటి దిగ్గజ నటుల చిత్రాలకు పాటలు అందించారు. అయితే ఆయన చేత తన ప్రతీ సినిమాలో పాటలు రాయించిన గొప్పదనం మాత్రం సూపర్ స్టార్ క్రిష్ణదే. అందుకే క్రిష్ణ అంటే శ్రీశ్రీకి ఎంతో అభిమానం. ఒక సందర్భంలో శ్రీశ్రీ మాట్లాడుతూ తాను రాసిన ప్రతీ అక్షరానికి విలువ కట్టి నగదు పారితోషికం ఇచ్చిన ఏకైక హీరో క్రిష్ణ అంటూ ప్రశంసించారు. క్రిష్ణ నటించి నిర్మించిన అల్లూరి సీతారామరాజు సినిమా ద్వారానే శ్రీశ్రీకి జాతీయ పురస్కారం దక్కడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.
ఈ శతాబ్దం నాది అంటూ :
ఇక ఆధునిక తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ ఒక కొత్త అధ్యాయం సృష్టించారు. ఆయన రచించిన మహాప్రస్థానం కవితా సంపుటి ఇప్పటికి తొంబై ఏళ్ళు అయినా అద్భుతమైన కావ్యంగా నిలిచి గెలిచింది. అది ఎప్పటికీ కాలానికి అతీతరంగా ఉత్తమ సాహితీ రచనగా ఉంటుంది. అందులో శ్రీశ్రీ రాసిన నేను సైతం అన్న కవిత ఎన్నో సినిమాల్లో ఉపయోగించారు. యుగానికి ఒక మహా పురుషుడు అని చెబుతారు. అలా తెలుగు సాహితీ లోకానికి మహా కవి కూడా ఒక్కరే అని చెప్పాలి. ఆయనే శ్రీశ్రీ అంటే అతిశయోక్తి కాదు. శ్రీశ్రీ 1983 జూన్ 15న తన 73వ ఏట మరణించారు. విశాఖ వీధులలో సాగర కెరటాలలో శ్రీశ్రీ కవితా ప్రభావం ఈ రోజుకీ పరిమళిస్తూనే ఉంటుంది. ఆ మహాకవి జయంతి సందర్భంగా సాహితీ లోకం ఘన నివాళి అర్పిస్తోంది.
