సూపర్ స్టార్ కృష్ణ ముఖ్యమంత్రి అయ్యేవారే...కానీ !
ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈ రోజు. ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ హీరో. క్రిష్ణ లాంటి నటుడు మళ్ళీ పుడతారా అంటే ఏమో చెప్పలేమనే అంటారు
By: Tupaki Desk | 31 May 2025 11:52 AM ISTప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ జయంతి ఈ రోజు. ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ హీరో. క్రిష్ణ లాంటి నటుడు మళ్ళీ పుడతారా అంటే ఏమో చెప్పలేమనే అంటారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవ ఎనలేనిది. ఈ రోజు సినీ థియేటర్ల సమస్య ఉంది. వారికి ఫీడింగ్ లేదు. కానీ క్రిష్ణ హీరోగా ఉన్న రోజులలో నెలకు కనీసం ఒక సినిమా కచ్చితంగా రిలీజ్ చేసి మంచి ఫీడింగ్ థియేటర్లకు ఇచ్చేవారు.
ఆయనకు ఎంతటి సూపర్ స్టార్ డం వచ్చినా కొత్త నిర్మాతలను దర్శకులను టెక్నీషియన్లను ప్రోత్సహిస్తూ వారి కోసం సినిమాలు చేసేవారు. అలా ఏడాదికి కనీసంగా పన్నెండు సినిమాలు తగ్గకుండా చేస్తూ సినీ పరిశ్రమని బతికించేవారు. అలాంటి హీరో క్రిష్ణ రాజకీయాల్లోకి రావడం అనూహ్యంగా జరిగింది. ఆయన 1984లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
స్వతహాగా ఆయన కాంగ్రెస్ మనిషి. రాజీవ్ గాంధీ అభిమాని. ఆయన ప్రధాని అయ్యాక క్రిష్ణను కాంగ్రెస్ లోకి తెచ్చారు. అలా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద క్రిష్ణను ప్రయోగించారు. క్రిష్ణ సైతం తన వంతు పాత్రను పోషిస్తూ ఏపీలో బక్కచిక్కిన కాంగ్రెస్ కి పెద్ద దిక్కుగా ఉండేవారు. అయిదేళ్ల పాటు క్రిష్ణ టీడీపీ మీద చేసిన పోరాట ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1989లో అధికారంలోకి వచ్చింది అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వం తొలిసారి ఓటమి చవి చూసింది.
ఇక ఆనాడు అంతా క్రిష్ణను కాబోయే సీఎం గానే చెప్పేవారు. క్రిష్ణకు కాంగ్రెస్ హై కమాండ్ తో ముఖ్యంగా రాజీవ్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయన తప్పకుండా సీఎం అవుతారని అనుకునేవారు. ఇక రాజీవ్ గాంధీ కూడా ఎంతో చరిష్మా ఉన్న క్రిష్ణను సీఎం చేయాలని భావించారని అంటారు.
అయితే 1991 మే 21న రాజీవ్ గాంధీ తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్ లో జరిగిన మానవ బాంబు దాడిలో అకాల మృత్యువాత పడడంతో క్రిష్ణ కూడా రాజకీయ వైరాగ్యం చెందారు. ఆయన 1989లో ఏలూరు నుంచి లోక్ సభకు కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇక 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే తనకు రాజకీయాలు వద్దు అనుకున్నారు.
అది లగాయితూ ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. జీవితకాలమంతా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయనకు నచ్చిన ముఖ్యమంత్రులలో వైఎస్సార్ ఒకరు. ఇక రాజీవ్ గాంధీ లేని రాజకీయం తనకు వద్దు అనుకుని క్రిష్ణ కఠిన నిర్ణయం తీసుకోవడం వల్లనే ఆయన స్వల్పకాలంలోనే రాజకీయాల్లో నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. లేకపోయి ఉంటే క్రిష్ణ రాజకీయ జీవితం మరో ఎత్తులో ఉండేది. ఇక రాజీవ్ గాంధీ బతికి ఉంటే ఆయన కచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఉండేవారు అని కూడా అంటారు.
ఏది ఏమైనా సాహసమే తన జీవితంగా మార్చుకుని తాను నమ్మిన దానికి కట్టుబడి పట్టుదలతో పనిచేసిన క్రిష్ణ ఎప్పటికీ సూపర్ స్టారే అని చెప్పక తప్పదు. ఎంతో మంది నటులు వస్తారు, స్టార్లు వస్తారు. కానీ సూపర్ స్టార్ అన్న బిరుదు మాత్రం క్రిష్ణదే అని చెప్పాలి. ఆయన నటుడిగానే కాదు మంచి మనిషిగా కూడా జనం గుండెలలో కొలువు తీరి ఉన్నారు. అందుకే ఆయన పుట్టిన రోజును అంతా గుర్తు పెట్టుకుని మనసారా తలచుకుంటారు. దటీజ్ సూపర్ స్టార్.
