అమరావతి మహిళలపై వ్యాఖ్యల కేసు.. కొమ్మినేని బెయిల్ పై సుప్రీం ఫైనల్ డెసిషన్
అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయి ప్రస్తుతం బెయిలుపై ఉన్న సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది.
By: Tupaki Desk | 14 Aug 2025 5:54 PM ISTఅమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు అయి ప్రస్తుతం బెయిలుపై ఉన్న సాక్షి జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఈ కేసులో గతంలో ఆయనకు షరతులతో కూడిన మధ్యాంతర బెయిలును సుప్రీంకోర్టు మంజూరు చేయగా, దాన్ని ఇప్పుడు పర్మినెంట్ బెయిలుగా మార్చుతూ తీర్పునిచ్చింది. దీంతో కేసు విచారణ ముగిసినట్లైంది. అదే సమయంలో గతంలో కొమ్మినేని లైవ్ షో నిర్వహణపై ఇచ్చిన ఆదేశాలను సవరించింది.
సాక్షి చానల్ లో ప్రతిరోజూ ఉదయం కేఎస్ఆర్ లైవ్ షో పేరిట సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని డిబేట్ నిర్వహిస్తుంటారు. జూన్ 6న యథావిధిగా కొమ్మినేని డిబేట్ నిర్వహిస్తుండగా, విజయవాడకు చెందిన జర్నలిస్టు కృష్ణంరాజు అతిథిగా డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో సెక్స్ వర్కర్లు పెరిగిపోతున్న విషయంపై పత్రికల్లో వార్తలు రాగా, జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలతో పెను వివాదం రేగింది. జర్నలిస్టు కొమ్మినేని ప్రోద్బలంతోనే కృష్ణంరాజు ఆ వ్యాఖ్యలు చేశారంటూ అమరావతి మహిళలు ఆందోళనలు చేశారు. అప్పట్లో కొమ్మినేనితోపాటు కృష్ణంరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు జూన్ 9న కొమ్మినేని హైదరాబాద్ లో ఆయన నివాసంలో అరెస్టు చేశారు. అనంతరం గుంటూరు జైలుకు తరలించారు. అయితే టీవీ చానల్ చర్చా కార్యక్రమాల్లో అతిథులుగా వచ్చేవారు చేసే వ్యాఖ్యలకు జర్నలిస్టులు ఎలా బాధ్యులు అవుతారని కొమ్మినేని తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన అరెస్టును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో అదే నెల 13న సుప్రీంకోర్టులో కొమ్మినేనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు మధ్యాంతర బెయిలును పూర్తిస్థాయి బెయిలుగా సవరించింది.
ఇక టీవీ షోలో గెస్టులు చేసే పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతించకూడదని మధ్యాంతర ఉత్తర్వుల్లో సుప్రీం షరతు విధించింది. అయితే లైవ్ షోలో గెస్టులు చేసే వ్యాఖ్యలను ఎలా కంట్రోల్ చేయగలమన్న కొమ్మినేని తరఫు న్యాయవాదుల అభ్యర్థనతో న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో మధ్యాంతర బెయిలు తీర్పులో పేర్కొన్న నిబంధనను తొలగిస్తున్నట్లు జస్టిస్ నాగరత్న, కేవీ విశ్వనాథ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక ఇలాంటి కేసుల్లో ఆర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తప్పనిసరిగా పాటించాలని, ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో 41ఏ నోటీసు ఇచ్చి ప్రాథమిక విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది.
