Begin typing your search above and press return to search.

స్టార్‌లింక్‌కు స్వాగతం.. పోటీకి జియో రెడీ!

భారత్‌లో పెట్టుబడులు పెట్టే దేశీయ, విదేశీ సంస్థలకు సమాన అవకాశాలు ఉండాలని రిలయన్స్ అభిప్రాయపడింది.

By:  Tupaki Desk   |   16 Oct 2026 10:47 AM IST
స్టార్‌లింక్‌కు స్వాగతం.. పోటీకి జియో రెడీ!
X

స్టార్‌లింక్ సహా శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోకి వచ్చే సంస్థలతో పోటీకి తాము సిద్ధమని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. భారత మార్కెట్‌పై ఇటీవల వస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలను వెల్లడించాలనే ఉద్దేశంతో ఈ ప్రకటన విడుదల చేసినట్లు తెలిపింది.

భారత్‌లో పెట్టుబడులు పెట్టే దేశీయ, విదేశీ సంస్థలకు సమాన అవకాశాలు ఉండాలని రిలయన్స్ అభిప్రాయపడింది. అయితే వ్యాపారం చేసే ప్రతి సంస్థ దేశ చట్టాలు, ప్రభుత్వ విధానాలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఈ విషయంలో భారత ప్రభుత్వం ప్రతి దరఖాస్తుదారుడికీ ఒకే విధమైన ప్రక్రియను అనుసరిస్తోందని తెలిపింది. జియోకు చెందిన శాటిలైట్ సేవలు కూడా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాయని వెల్లడించింది.

పోటీని తాము ఎప్పుడూ భయపడలేదని రిలయన్స్ తన ప్రకటనలో పేర్కొంది. వినియోగదారులకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారనేది పోటీయే నిర్ణయిస్తుందని తెలిపింది. 2016లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన జియోకు అప్పట్లో ఒక్క వినియోగదారుడు కూడా లేడని, ఇప్పుడు 530 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్నారని గుర్తుచేసింది. అందుబాటు ధరల్లో డేటా సేవలను అందిస్తూ భారత డిజిటల్ రంగంలో కీలక మార్పులు తీసుకొచ్చామని పేర్కొంది.

శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలో స్టార్‌లింక్ వంటి సంస్థల ప్రవేశాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు రిలయన్స్ స్పష్టం చేసింది. జియోతో సహా ప్రతి సంస్థ భారత ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు దేశ నిబంధనలను పాటించాలని తెలిపింది.

ఈ ప్రకటనలో రిలయన్స్ ప్రధానంగా రెండు విషయాలను స్పష్టం చేసింది. ఒకవైపు శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో పోటీకి సిద్ధమని చెబుతూనే, మరోవైపు అనుమతుల విషయంలో అందరికీ ఒకే విధమైన నిబంధనలు వర్తించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. స్టార్‌లింక్, జియో శాటిలైట్ సేవలు భారత మార్కెట్‌లో ఎలా పోటీపడతాయన్నది ఆసక్తికరంగా మారింది.