Begin typing your search above and press return to search.

ఎలోన్ మ‌స్క్ స్టార్ లింక్‌కు చెక్ పెట్టేందుకు రిలయ‌న్స్ బిగ్ ప్లాన్!

భారతీయ పారిశ్రామిక దిగ్గ‌జం ముఖేష్ అంబానీ సార‌థ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో విప్లవాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది.

By:  Sivaji Kontham   |   7 May 2026 5:00 AM IST
ఎలోన్ మ‌స్క్ స్టార్ లింక్‌కు చెక్ పెట్టేందుకు రిలయ‌న్స్ బిగ్ ప్లాన్!
X

భారతీయ పారిశ్రామిక దిగ్గ‌జం ముఖేష్ అంబానీ సార‌థ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో విప్లవాత్మక అడుగు వేయడానికి సిద్ధమైంది. ఎలోన్ మస్క్‌కు చెందిన`స్టార్‌లింక్` శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు ధీటుగా.. సొంతంగా లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌.ఇ.వో) శాటిలైట్ వ్యవస్థను నిర్మించేందుకు రిలయన్స్ బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రిలయన్స్ డిజిటల్ విభాగమైన `జియో ప్లాట్‌ఫారమ్స్`లో ఒక భాగం. ఇది భారతదేశపు శాటిలైట్ కమ్యూనికేషన్ ముఖచిత్రాన్నే మార్చివేసే అవకాశం ఉంద‌ని అంచ‌నా.

ఈ భారీ ప్రాజెక్టును ముఖేష్ అంబానీ స్వయంగా పర్యవేక్షిస్తుండటం చూస్తుంటే.. దీని ప్రాధాన్యతను చాటి చెబుతోంది. శాటిలైట్ లాంచ్‌లు, పేలోడ్‌లు, ఉపగ్రహాల తయారీ, యూజర్ టెర్మినల్స్ వంటి ర‌క‌ర‌కాల‌ విభాగాల కోసం ఇప్పటికే ఆరు ప్రత్యేక నిపుణుల బృందాలను రిలయన్స్ ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు) నుండి ఆర్బిటల్ స్లాట్ల కేటాయింపు కోసం టెలికాం శాఖతో చర్చలు జరుపుతూ గ్లోబల్ రేసులో భారత్ వెనుకబడకుండా రిలయన్స్ వేగంగా పావులు కదుపుతోంది.

సాధారణ ఉపగ్రహాల కంటే భూమికి అతి దగ్గరగా ఉండే లియో శాటిలైట్లు హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించడంలో అత్యంత సమర్థవంతమైనవి. ముఖ్యంగా ఫైబర్ కేబుల్స్ వేయడానికి వీలులేని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ సాంకేతికత వరంగా మారనుంది. కేవలం క‌మ‌ర్షియ‌ల్ గానే కాకుండా.. జాతీయ భద్రత -వ్యూహాత్మక సాంకేతికత పరంగా విదేశీ కంపెనీలపై ఆధారపడకుండా స్వదేశీ శాటిలైట్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం.

ఈ రంగంలోకి వేగంగా ప్రవేశించేందుకు రిలయన్స్ భారీ ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసింది. వ్యవస్థను సొంతంగా నిర్మించడంతో పాటు.. ఇప్పటికే ఆర్బిటల్ స్లాట్లు.. మౌలిక సదుపాయాలు ఉన్న ఇతర కంపెనీలను కొనుగోలు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. ఇప్పటికే శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ఎస్‌.ఇ.ఎస్ తో రిలయన్స్‌కు ఉన్న భాగస్వామ్యం ఈ ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలవనుంది. చైనా వంటి దేశాలు ఇప్పటికే లక్షలాది ఉపగ్రహాల కోసం దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో భారత్ కూడా డిజిటల్ లో స‌త్తాను చాటుకోవడానికి ఇది సరైన సమయమ‌ని భావిస్తోంది.

వచ్చే రెండు నుండి నాలుగు ఏళ్లలో రిలయన్స్ తన సొంత `లియో` శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో జియో ద్వారా మొబైల్ డేటా ధరలను తగ్గించి సామాన్యుడికి ఇంటర్నెట్ అందించినట్లుగానే... ఇప్పుడు శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలోనూ రిలయన్స్ సరికొత్త విప్లవం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. అంబానీ నేతృత్వంలోని ఈ ప్రాజెక్టు స్టార్‌లింక్, అమెజాన్ కుయిపర్ వంటి గ్లోబల్ దిగ్గజాలకు గట్టి పోటీనిస్తూ భారత్‌ను గ్లోబల్ శాటిలైట్ మ్యాప్‌లో అగ్రస్థానంలో నిలబెట్టనుంది.