ఏలూరులో రిలయన్స్ భారీ పెట్టుబడి : రూ.2.73 లక్షలతో అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు!
ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు రాగా, తాజాగా గోదావరి తీర ప్రాంతంలో రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
By: Tupaki Desk | 20 Aug 2026 12:20 PM ISTఏపీకి మరో భారీ పెట్టుబడి ఖరారైంది. ఇప్పటివరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు రాగా, తాజాగా గోదావరి తీర ప్రాంతంలో రూ.2.73 లక్షల కోట్ల పెట్టుబడికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు కేంద్ర గనులశాఖ నిర్వహించిన వేలాన్ని దక్కించుకుందని చెబుతున్నారు. దీంతో ఏలూరు జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్' (UCG) ప్రాజెక్టును ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు రాకతో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం చెబుతోంది.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత ఇదే..
సాధారణంగా బొగ్గును గనుల నుంచి వెలికితీసి వాడతారు. కానీ, 'అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్' (UCG) పద్ధతిలో బొగ్గును భూగర్భంలోనే గ్యాస్‌గా మారుస్తారు. ఇలా ఉత్పత్తి అయిన గ్యాస్‌ను విద్యుత్, ఎరువులు, ఇతర పారిశ్రామిక అవసరాలకు ముడిసరుకుగా ఉపయోగిస్తారు. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం రాబోయే 30 ఏళ్లలో సుమారు రూ. 2.73 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని రిలయన్స్ వెచ్చించనుంది. ఏలూరు జిల్లాలోని చింతలపూడి, రేచర్ల కోల్ బ్లాకులను కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ-వేలంలో రిలయన్స్ విజయవంతంగా దక్కించుకుందని ప్రభుత్వం వెల్లడించింది.....
ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు మూడు దశల్లో పరిశీలన చేపట్టనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. మొదటి దశలో ఈ ఏడాది ప్రాథమిక అన్వేషణ, పైలట్ ప్రాజెక్టు పనులు ప్రారంభం కానున్నాయి. రెండవ దశలో ప్రాజెక్టు వాణిజ్య అవకాశాలను అంచనా వేస్తారు. మూడవ దశలో ప్రాజెక్ట్ లాభదాయకమని తేలిన తర్వాత, దీర్ఘకాల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటామని వివరించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ సామాజిక ఆర్థిక ప్రగతికి అవకాశాలు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ప్రాజెక్ట్ కార్యకలాపాలు ఊపందుకున్నాక, సుమారు 3,000 నుంచి 5,000 మందికి నేరుగా ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. అలాగే, ఈ భారీ ప్రాజెక్టుకు అవసరమైన రవాణా, లాజిస్టిక్స్, సేవల రంగంలో సుమారు 20,000 నుండి 35,000 మందికి పరోక్ష జీవనోపాధి లభిస్తుందని రిలయన్స్ అంచనా వేస్తోంది. ఇది ఏలూరు పరిసర జిల్లాల ఆర్థిక పురోగతిని పూర్తిగా మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ 'నేషనల్ కోల్ గ్యాసిఫికేషన్ మిషన్' లక్ష్యానికి ఒక గొప్ప బలమని వ్యాఖ్యానిస్తున్నారు. దేశ ఇంధన భద్రతను పటిష్టం చేస్తూ, 2030 నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు గ్యాసిఫికేషన్ సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంలో రిలయన్స్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద 'ఇంటిగ్రేటెడ్ UCG' ప్రాజెక్టుగా నిలవనుందని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అనుకూల విధానాలను అనుసరిస్తున్న తరుణంలో, రిలయన్స్ వంటి సంస్థ ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం మరికొందరు పెట్టుబడిదారులకు ఉన్న మార్గనిర్దేశం చేస్తుందని అంటున్నారు.
