Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికల్లో 'కుటుంబ' రాజకీయం.. ఫలితాల తర్వాత పరిస్థితేంటో?

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమరం రక్త సంబంధీకులు, బంధువుల మధ్య హోరాహోరీ పోరుగా రూపాంతరం చెందింది.

By:  Tupaki Desk   |   30 Oct 2026 2:57 PM IST
స్థానిక ఎన్నికల్లో కుటుంబ రాజకీయం.. ఫలితాల తర్వాత పరిస్థితేంటో?
X

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమరం రక్త సంబంధీకులు, బంధువుల మధ్య హోరాహోరీ పోరుగా రూపాంతరం చెందింది. రాజకీయ సమీకరణాలు, రిజర్వెషన్ల కేటాయింపుల పుణ్యమాని ఒకే కుటుంబానికి చెందిన వారు వేర్వేరు జెండాలు పట్టుకుని ఒకరిపై ఒకరు పోటీకి సిద్ధమవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ పల్లెల్లో నెలకొన్న ఈ విచిత్రమైన వాతావరణం ఓటర్లతో పాటు స్థానికంగా హాట్ టాపిక్ అవుతోంది. మహిళా రిజర్వేషన్ అయిన చోట భార్యాభర్తలు కలిసి పోటీ చేస్తుంటే, మరికొన్ని చోట్ల ఒకే కుటుంబం నుంచి ఒకే స్థానానికి పోటీపడుతూ పదవి తమ గుమ్మం దాటకుండా చూపుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి స్థానాలు పదుల సంఖ్యలో ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కలివరం ఎంపీటీసీ స్థానానికి ఒకే కుటుంబానికి చెందిన తోడికోడళ్లు బుద్దేపు లక్ష్మి (తెలుగుదేశం పార్టీ), బుద్దేపు కూరమ్మ (వైఎస్సార్సీపీ) నామినేషన్లు దాఖలు చేశారు. ఒకప్పుడు ఇదే స్థానం కోసం అన్నదమ్ములు తలపడగా, ఇప్పుడు మహిళలకు రిజర్వు చేయడంతో తమ భార్యలను రణరంగంలోకి దించారని చెబుతున్నారు. ఇదే రీతిలో నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని మొగళ్లూరు ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. ఈ స్థానం కోసం తోడికోడళ్లు అయిన కూకట్ల శంకరమ్మ (టీడీపీ), కూకట్ల ఉష (వైఎస్సార్సీపీ) సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డులు ఎంపీటీసీ స్థానాల విభజన తీరు కుటుంబాల మధ్య రాజకీయ విభేదాలకు ఆజ్యం పోసింది. ఉమ్మడి కుటుంబాల్లో కలిసిమెలిసి ఉండే సొంత అన్నదమ్ములు, బావబావమరుదులు సైతం వేర్వేరు పార్టీల కండువాలు కప్పుకుని బరిలో నిలుస్తున్నారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఎవరి పార్టీ వ్యూహాల్లో వారు బిజీగా ఉంటూ, బహిరంగ ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇక కాకినాడ జిల్లా రౌతులపూడిలో అయితే ఒకే కుటుంబం నుంచి భార్యాభర్తలు పైలా అశోక్, సౌజన్యలు వేర్వేరు ఎంపీటీసీ స్థానాల నుంచి టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా, అదే కుటుంబానికి చెందిన లోవ కళ్యాణి (సౌజన్య ఆడపడుచు వరుస) జెడ్పీటీసీ స్థానానికి బరిలో నిలిచి వినూత్న రాజకీయం నడిపిస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి గోదావరి జిల్లాలోని కడియం మండలంలో ఎంపీపీ పోరు రాజకీయంగా పీక్స్‌కి చేరింది. ఇక్కడ ఎంపీపీ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ప్రముఖ నర్సరీ రైతులు తమ సకుటుంబంగా ఎన్నికల బరిలోకి దిగారు. కూటమి తరఫున బోడపాటి గోపాలకృష్ణ భార్య పుణ్యవతి, వైసీపీ తరఫున తాడాల విష్ణు చక్రవర్తి భార్య రాజరాజేశ్వరి ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. కేవలం భార్యలే కాకుండా, ఆ భర్తలు కూడా వేర్వేరు ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీ చేస్తుండటంతో ఈ కడియపులంక రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

గ్రామాల్లో సొంత వాళ్ల పంచాయితీ నడుస్తుండటంతో ఓటర్లు డైలమాలో పడుతున్నారని చెబుతున్నారు. బంధుత్వానికి పెద్దపీఠ వేసి ఎవరికో ఒకరికి ఓటేయాలా? లేక తాము నమ్మిన పార్టీ సిద్ధాంతాలు, అభ్యర్థుల సమర్థతను బట్టి తీర్పునివ్వాలా? అని తేల్చుకోలేక తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు. ఎన్నికల పోరు ముగిసి, ఫలితాలు వెలువడిన తర్వాత గెలుపు ఓటముల ప్రభావం ఈ కుటుంబాల బాంధవ్యాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.