Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ కోసం బలి చేస్తారా? బీఆర్ఎస్ కు మహిళా ఎమ్మెల్యే గుడ్ బై!

తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రేఖా నాయక్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:56 AM GMT
ఫ్రెండ్ కోసం బలి చేస్తారా? బీఆర్ఎస్ కు మహిళా ఎమ్మెల్యే గుడ్ బై!
X

కీలక మైన అసెంబ్లీ ఎన్నికలు రోజుల్లోకి వచ్చేసిన వేళ.. తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. తాము కోరుకున్నవి లభించని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఈ సందర్భంగా ఏ రోజుకు ఆ రోజు మార్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి. తాజాగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ అధికార పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న రేఖా నాయక్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో ఆమెకు టికెట్ లభించకపోవటం తెలిసిందే. నియోజకవర్గంలో ఆమె గెలుపు కష్టమన్న సర్వే అంచనాలతో పాటు.. ఇతర అంశాలు తోడు కావటంతో ఆమెకు బదులుగా జాన్సన్ నాయక్ కు కేటాయిస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎమ్మెల్యే భర్త కాంగ్రెస్ పార్టీలో చేరటంతో.. ఆమె కూడా ఆ పార్టీలో చేరటం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది.

పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా మాట్లాడిన రేఖానాయక్.. పార్టీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తానేం తప్పు చేసినందుకు టికెట్ ఇవ్వలేదో? చెప్పాలన్న ఆమె.. జాన్సన్ నాయక్ ఎలా గెలుస్తాడో తాను చూస్తానని పేర్కొన్నారు. తానేమీ స్కామ్ లు చేయలేదని.. అయినా తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలంటూ నిలదీశారు.

స్నేహితుడి కోసం తనను ఇంత దారుణంగా మోసం చేస్తారా? అని ప్రశ్నించిన రేఖా నాయక్.. చివరి వరకు తనకేమైనా గుర్తింపు లభిస్తుందా? అని ఎదురుచూశారా. రెండు రోజుల క్రితం విడుదల చేసిన నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆమెకు స్థానం దక్కకపోవటం.. అధిష్ఠానం నుంచి బుజ్జగింపులు సంత్రప్తి కరంగా లేకపోవటంతో పార్టీకి రాజీనామా చేయాలన్న కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. తన శపధాన్ని ఆమె ఎలా నెరవేర్చుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.