Begin typing your search above and press return to search.

బీఆర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ టికెట్.. నమ్మేదెలా?

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేసి సీఎం కేసీఆర్ పొలిటికల్ హీట్ రాజేశారు

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:30 PM GMT
బీఆర్ ఎమ్మెల్యే.. కాంగ్రెస్ టికెట్.. నమ్మేదెలా?
X

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 115 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేసి సీఎం కేసీఆర్ పొలిటికల్ హీట్ రాజేశారు. ఇందులో ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ మళ్లీ అవకాశం ఇవ్వలేదు. ఆ జాబితాలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోడంతో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు కూడా సమర్పించారు. కానీ బీఆర్ఎస్లోనే కొనసాగుతూ.. కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించిన ఆమెను నమ్మేదెలా అనే ప్రశ్నలు కాంగ్రెస్లో వినిపిస్తున్నాయి.

రేఖ నాయక్కు కేసీఆర్ టికెట్ ఇవ్వరని తెలియగానే ఆమె భర్త అజ్మీరా శ్యాం నాయక్ కాంగ్రెస్లో చేరిపోయారు. ఆయన అసిఫాబాద్ టికెట్ కోసం దరఖాస్తు సమర్పించారు. మరోవైపు రేఖా నాయక్ తరపున ఆమె పీఏ ఖానాపూర్ టికెట్ కోసం దరాఖాస్తు చేశారు. కానీ ఇప్పటికీ తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని రేఖా నాయక్ పేర్కొనడమే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు వచ్చేంత వరకూ ఆ పదవి తనదేనని ఆమె అన్నట్లు తెలిసింది. అంతే కాకుండా తన భర్త ఆవేశంలో కాంగ్రెస్లో చేరారని కూడా ఆమె పేర్కొనడం విచిత్రంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్ఎస్లో ఉంటూనే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుుకోవడం రెండు పార్టీల నాయకులను విస్మయానికి గురి చేస్తుందని టాక్. బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత దరఖాస్తు చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే దరఖాస్తు అయితే చేద్దాం.. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని రేఖా భావించారేమోననే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. దీంతో ఆమెను నమ్మేదెలా అని ఖానాపూర్ కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారని తెలిసింది. పైగా ఆమె పార్టీలోకి వస్తే ఇప్పటికే అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలు ఏమై పోవాలనే ప్రశ్న కూడా వినిపిస్తోంది.