Begin typing your search above and press return to search.

ఇమ్రాన్ వచ్చేలా లేడు.. ఆయన మాజీ భార్య మొదలెట్టింది

ఆమె ‘పాకిస్థాన్‌ రిపబ్లిక్‌ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కరాచీలో జరిగిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

By:  Tupaki Desk   |   17 July 2025 12:00 AM IST
ఇమ్రాన్ వచ్చేలా లేడు.. ఆయన మాజీ భార్య మొదలెట్టింది
X

పాకిస్థాన్ రాజకీయాల్లో ఓ కీలక మలుపు తిరిగింది. దేశ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ వ్యవస్థాపకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య, జర్నలిస్టు రెహమ్‌ ఖాన్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ఆమె ‘పాకిస్థాన్‌ రిపబ్లిక్‌ పార్టీ’ పేరిట కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు కరాచీలో జరిగిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు.

సామాన్య ప్రజల గొంతుకగా రాజకీయాల్లోకి

ఈ సందర్భంగా రెహమ్‌ ఖాన్ మాట్లాడుతూ “గతంలో రాజకీయ పదవుల కోసం ఎప్పుడూ పోటీ పడలేదు. ఒకసారి ఒక్క వ్యక్తి కోసం పార్టీలో చేరిన అనుభవం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం దేశ ప్రజల కోసమే స్వయంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా. ఇది కేవలం మరో రాజకీయ పార్టీ కాదు.. సేవా ఉద్యమం,” అని తెలిపారు.

దేశంలో మార్పు కోసం.. కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా

ప్రస్తుత పాలకవర్గాలపై ప్రజల్లో తీవ్ర నిరాశ నెలకొందని, ఈ నేపథ్యంలోనే కొత్త పార్టీని ప్రారంభించినట్టు రెహమ్‌ స్పష్టం చేశారు. దేశ ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని ఎత్తిచూపుతూ “2012 నుండి తాగునీరు, కనీస వసతులు దేశంలో కరవయ్యాయి. ఇది ఇక ఆమోదయోగ్యం కాదు” అంటూ విమర్శలు గుప్పించారు.కుటుంబ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆమె “ఏ మద్దతు లేకుండానే, పూర్తి స్వతంత్రంగా ఈ పార్టీని ఏర్పాటు చేశాం. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. అధికారం కోసం కాదే, సేవకోసమే మా ఉద్యమం సాగుతుంది,” అన్నారు.

త్వరలో మేనిఫెస్టో విడుదల

తాము త్వరలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తామని రెహమ్ ఖాన్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థను సవాల్ చేయడమే తమ తొలి ప్రాధాన్యతగా పేర్కొన్నారు. కరాచీ ప్రెస్ క్లబ్‌ను ఉద్దేశిస్తూ "ఈ కష్టకాలంలో నన్ను అండగా నిలబెట్టిన ప్రదేశం ఇదే. అందుకే ఇక్కడ నుంచే నా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించడాన్ని గౌరవంగా భావిస్తున్నా," అని చెప్పారు.

ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సో ఆయన స్థానాన్ని భర్తి చేయడానికే ఆయన మాజీ భార్య రాజకీయాల్లోకి వచ్చింది. రెహమ్‌ ఖాన్‌ రాజకీయాల్లోకి ప్రవేశించడం, అది కూడా స్వంతంగా పార్టీ స్థాపించడమే పాకిస్థాన్ రాజకీయాలలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఆమె ప్రయాణం ఎటు దారితీస్తుందో చూడాల్సి ఉంది.