Begin typing your search above and press return to search.

"రెడ్‌ లైట్‌ ఆన్‌ - గాడీ ఆఫ్‌" స్టార్ట్... మీకర్ధమవుతుందా?

ఈ కొత కార్యక్రమం ప్రకారం... రోడ్లపై రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజన్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   24 Oct 2023 4:07 AM GMT
రెడ్‌  లైట్‌  ఆన్‌ - గాడీ ఆఫ్‌ స్టార్ట్... మీకర్ధమవుతుందా?
X

ఢిల్లీలో వాతావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మరిముఖ్యంగా చలికాలం వచ్చిందంటే అక్కడ కాలుష్య తీవ్రత మరింత పెరుగుతుంది. ఈ కాలుష్యానికి తోడు పొగమంచు కలిసే సరికి... ఉదయం 10 అయినా తెల్లారనట్లే ఉంటుంటుంది. ఇప్పటికే ఢిల్లీలో చలి తీవ్రత పెరగడంతో కాలుష్య శాతం ప్రమాదకరస్థాయికి చేరిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో... కాలుష్య నియంత్రణకు కేజ్రీవాల్ సర్కార్ సరికొత్త నిబంధనలను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ అధ్యక్షతన పలు విభాగాల అధికారులు ఢిల్లీ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గోపాల్‌ రాయ్‌ మాట్లాడుతూ.. వాయు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు "రెడ్‌ లైట్ ఆన్‌.. గాడీ ఆఫ్" క్యాంపెయిన్‌ ను అక్టోబర్‌ 26 నుంచి ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఈ కొత కార్యక్రమం ప్రకారం... రోడ్లపై రెడ్ లైట్ పడినప్పుడు వాహనాల ఇంజన్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాతే వాహనాలను ఆన్ చేసి ముందుకు కదలాల్సి ఉంటుంది. ఆ కాసేపైనా వాహనాల ఇంజన్ ను ఆపడం ద్వారా కొంతసేపైనా వాటి నుంచి వచ్చే పొగను నియంత్రించవచ్చని, ఫలితంగా ఎంతోకొంత వాయుకాలుష్యాన్ని తగ్గించొచ్చని ఢిల్లీ ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.

అదేవిధంగా... ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి "డస్ట్ సప్రెసెంట్ పౌడర్" ని ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో కాలుష్యస్థాయి ఏక్యూఐ 300 మార్కును దాటడంతో టపాసులు పేల్చడాన్ని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది. గత ఏడాది దీపావళి సమయంలో కూడా బాణాసంచాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం దసరా వేడుకల్లో కూడా ఎక్కడా టపాసులు పేల్చవద్దని కేజ్రీవాల్ సర్కార్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో హస్తినలో ఎక్కడా టపాసుల మోత వినిపించడం లేదని అంటున్నారు.

ఇదే సమయంలో టూవీలర్సే అధిక కాలుష్యానికి కారణమవుతున్నాయని.. అందువల్ల ద్విచక్రవాహనదారులంతా తమ వాహనాలకు పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ అప్‌ డేట్‌ చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఇదే సమయంలో మెట్రో అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని, అదేవిధంగా... బస్సులు సైతం ఇదే విషయాన్ని ఫాలో అవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

ప్రస్తుతానికి దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం 13 కాలుష్య హాట్‌ స్పాట్‌ లు ఉండగా.. ఈరోజు షాదిపూర్‌, మందిర్‌ మార్గ్‌, ప్రతాప్‌ గంజ్‌, సోనియా విహార్‌, మోతి బాగ్‌ తో పాటు మొత్తం ఎనిమిది పాయింట్లలో స్థానిక కారణాల వల్ల ఏక్యూఐ స్థాయిలు 300 కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఆయా చోట్ల స్థానిక కాలుష్య మూలాలను గుర్తించి తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి తెలిపారు.

కాగా... గతంలో దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత పెరిగినప్పుడు కొద్దిరోజులు బేసి సంఖ్యలతో ముగిసే నెంబర్లు ఉన్న వాహనాలు, మరి కొన్ని రోజులు సరి సంఖ్యలతో ముగిసే నెంబర్లు ఉన్న వాహనాలను అనుమతించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ నిబంధన అమలులో లేదు. ఆ స్థానంలో అన్నట్లుగా తాజాగా... "రెడ్‌ లైట్ ఆన్‌.. గాడీ ఆఫ్" కార్యక్రమాన్ని ఢిల్లీ సర్కార్ తెరపైకి తెచ్చింది.