రెడ్ల.. కొత్త పార్టీ.. హైదరాబాద్‌లో కీలక చర్చలు.. !
ఈ పరిణామాల క్రమానికి తోడు.. వైసీపీ ఓడిపోయిన తర్వాత.. 20 మాసాలైనా రెడ్డి సామాజిక వర్గంలో ఒక్కటంటే ఒక్క భేటీ కూడా నిర్వహించలేదు.
By: Garuda Media | 28 Feb 2026 9:00 PM ISTఏపీలో రెడ్డి సామాజిక వర్గం కొత్త పార్టీ కోసం ప్రయత్నిస్తోందా ? తమకు అనుకూల వేదిక కోసం ముమ్మరంగా చర్చిస్తోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి కొత్తగా రెడ్డి సామాజిక వర్గం తరఫున బలమైన పార్టీని ఏర్పాటు చేసుకునే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయని తెలిసింది. వాస్తవానికి రెడ్డి సామాజిక వర్గం జగన్‌ను నమ్ముకున్న విషయం తెలిసిందే. 2019లో అందరూ జగన్‌కు మద్దతు తెలిపారు.
కానీ, జగన్ రెడ్డి సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. రెడ్లకు సరైన ప్రాదాన్యం ఇవ్వలేక పోవడం.. వారికి కేటాయించిన సీట్లను కూడా బీసీలు, ఎస్సీలకు కేటాయించడం రాజకీయంగా రెడ్డి సామాజిక వర్గాన్ని అంతర్మథనంలో పడేసింది. ఇక, మరోవైపు.. రెడ్డి సామాజికవ ర్గానికి చెందిన పారిశ్రామిక వేత్తలను కూడా ఆయన ప్రోత్సహించలేకపోయారన్న వాదన ఉంది. దీంతో 2024 ఎన్నికల్లో జగన్‌కు రెడ్డి సామాజిక వర్గం దూరమైంది.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిల అయినా.. రెడ్డి సామాజిక వర్గానికి చేరువ అవుతుందని అనుకున్నారు. కానీ, ఆమె రాజకీయాలు కూడా భిన్నంగా ఉండడంతో రెడ్డి వర్గం ఆమెను కూడా దూరం పెట్టారు. మరోవైపు.. టీడీపీలో రెడ్లకు ప్రాధాన్యం ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ తరహా పరిస్థితి అనుకున్నంత ఆశించినంతగా అయితే లేవు. మరోవైపు బీజేపీ హిందుత్వ పార్టీగానే ముద్ర వేసుకుంది. పోనీ.. జనసేన వైపు చూడాలన్నా.. రెడ్లు సుముఖంగా లేరు.
ఈ పరిణామాల క్రమానికి తోడు.. వైసీపీ ఓడిపోయిన తర్వాత.. 20 మాసాలైనా రెడ్డి సామాజిక వర్గంలో ఒక్కటంటే ఒక్క భేటీ కూడా నిర్వహించలేదు. వారి సమస్యలు తెలుసుకోలేక పోయారు. దీంతో ఇప్పుడు తమకు సొంతపార్టీ పెట్టుకోవడం మినహా మరో మార్గం లేదని సీమ సహా నెల్లూరు రెడ్లు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కొత్త పార్టీ పెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణలో ఉంటున్న ఏపీకి చెందిన రెడ్డి నాయకులను కూడా కలుపుకొని వెళ్తున్నారని తెలిసింది. దీనిపై త్వరలోనే హైదరాబాద్‌లో చర్చలు చేయనున్నట్టు సమాచారం. మొత్తంగా రెడ్డి వర్గం చీలిపోతే.. అది వైసీపీనే మరింత ఇబ్బందిలో పడేస్తుందనిఅంటున్నారు పరిశీలకులు.
